కరీంనగర్‌ జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయాలు

13 Sep, 2022 19:51 IST|Sakshi

ఒక్కో పార్టీ ఒక్కో కార్యక్రమానికి శ్రీకారం

అభివృద్ధి మంత్రంతో టీఆర్‌ఎస్‌ నేతల హడావిడి

కేంద్ర ప్రభుత్వ పథకాలతో బీజేపీ బిజీ

‘పాదయాత్ర’తో కాంగ్రెస్‌ శ్రేణుల సందడి

ప్రజా సమస్యలపై వామపక్షాల కదనం 

కరీంనగర్‌: జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆయా పార్టీల నాయకులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పట్టు సాధించే ప్రయత్నాలకు శ్రీకారం చుడుతున్నారు. అభివృద్ధి, పథకాల పేరుతో టీఆర్‌ఎస్‌ హడావిడి చేస్తుండగా, పాదయాత్ర కార్యక్రమంతో కాంగ్రెస్‌ ప్రజల్లోకి వెళ్తోంది. ప్రధాని మోదీ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ పలు కార్యక్రమాలు చేపడుతోంది. వామపక్షాలు ప్రజా సమస్యలపై పోరాటాలు ఉధృతం చేస్తున్నాయి. 

వచ్చే ఏప్రిల్, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతుడటంతో ఆయా పార్టీల నేతలు పల్లెబాటతో పాటు శుభ, అశుభ కార్యక్రమాలకు హాజరవుతూ ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. కరీంనగర్‌ జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మూడుచోట్ల అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, హుజూరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో టీఆర్‌ఎస్‌ ప్రజాక్షేత్రంలోకి వెళ్తుండగా, ప్రజా సమస్యలపై నిరసనలతో విపక్షాలు హోరెత్తిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు రాకపోయినా ఇదే వాతావరణం సాధారణ ఎన్నికలు జరిగే వరకు ఉండే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.


బీజేపీలో ఉత్సాహం

కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తయిన నేపథ్యంలో బీజేపీ ఊరూరా సంబరాలు నిర్వహించింది. నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో సమావేశాలకు ప్రణాళిక రూపొందించి రాష్ట్రస్థాయి నాయకులను ఆహ్వానించారు. మొన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్, ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించాలని, ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ ధర్నాలు, నిరసనలతో ప్రజల్లోకి వెళ్లింది. ప్రస్తుతం కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో నాయకులు ఉన్నారు. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్రలో అల్లర్లు జరుగుతున్నాయనే కారణంతో పాదయాత్రను అడ్డుకొని కరీంనగర్‌కు తీసుకరావడంతో రెండు రోజుల పాటు జిల్లా కేంద్రంలో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్బంధాలపై సంజయ్‌ ఇంట్లో నిరసన దీక్షకు దిగడంతో బీజేపీ కేంద్ర, రాష్ట్ర నేతలు కరీంనగర్‌కు రావడం అతడికి సంఘీభావం తెలుపడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. 


వరంగల్‌ డిక్లరేషన్‌తో కాంగ్రెస్‌..

వరంగల్‌ డిక్లరేషన్‌ పేరుతో రైతులకు చేరువయ్యేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ వరంగల్‌లో సభ నిర్వహించినప్పటి నుంచి కాంగ్రెస్‌ శ్రేణులు కదనోత్సాహంతో పల్లెల్లో ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ, రైతులకు వద్దతు ధర హామీలతో ఆ నేతలు పలు కార్యక్రమాలు చేపట్టారు. మొన్నటి వరకు సభ్యత్వం పేరుతో, వరంగల్‌ డిక్లరేషన్‌తో ఇటీవల కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిర్వహించిన యాత్రతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. డీసీసీ అధ్యక్షుడు, మానకొండూర్‌ ఇన్‌చార్జి కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండిలో మేడిపల్లి సత్యం, హుజూరాబాద్‌లో బల్మూరి వెంకట్, కరీంనగర్‌లో నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తదితరులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్‌ ఆవశ్యకతను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.


గులాబీ దళంలో జోష్‌ 

కేంద్రంపై టీఆర్‌ఎస్‌ విమర్శల బాణం ఎక్కుపెట్టింది. ధాన్యం కొనుగోలు చేయడం లేదనే విమర్శలు మొదలుకొని బీజేపీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదని ప్రచారం చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. పల్లె, పట్టణ ప్రగతి, ఇతర కార్యక్రమాలతో ప్రజలను మచ్చిక చేసుకుంటోంది. దళితబంధు, నేతన్న బీమా, పింఛన్ల పంపిణీ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తూ పనిలోపనిగా బీజేపీ వైఫల్యాలను ఎండగడుతోంది. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామక్రిష్ణారావు, మేయర్‌ సునీల్‌రావు విస్తృతంగా పర్యటిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు. (క్లిక్‌: టీఆర్‌ఎస్‌లో కోల్డ్‌ వార్‌.. ఆడియో లీక్‌ కలకలం!)


పోరుబాటలో కామ్రేడ్స్‌ 

ప్రజాసమస్యలపై వామపక్షాలు పోరుబాట పడుతున్నాయి. సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ తదితర లెఫ్ట్‌ పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. సీపీఐ జిల్లా మహాసభలు ఇటీవల పూర్తి చేసుకొని జిల్లా కార్యదర్శిగా మర్రి వెంకటస్వామిని ఎన్నుకున్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శిగా మిల్కూరి వాసుదేవారెడ్డి ప్రజా సంఘాలను ఏకం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించడంతో పాటు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై స్పందిస్తూ పోరుబాటలో నిమగ్నమవుతున్నారు. అలాగే వైఎస్సార్‌టీపీ, బీఎస్‌పీ, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీలు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నాయి.  (క్లిక్‌: వచ్చే ఎన్నికల్లో పోటీ.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు)

మరిన్ని వార్తలు