Mamata Banerjee: కోల్‌కతా దీదీదే.. తృణమూల్‌ ‘హ్యాట్రిక్‌’

22 Dec, 2021 08:02 IST|Sakshi

కోల్‌కతా: కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ (కేఎంసీ) ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. వరసగా మూడోసారీ ఈ కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలుపుబావుటా ఎగరేసి టీఎంసీ హ్యాట్రిక్‌ కొట్టింది. 144 వార్డులున్న కార్పొరేషన్‌లో ఏకంగా 134 వార్డులను టీఎంసీ కైవసం చేసుకుంది. ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో దాదాపు 72 శాతం ఓట్లు టీఎంసీకే పడటం విశేషం. టీఎంసీకి ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేక బీజేపీ చతికిలపడింది. రెండు వార్డుల్లో గెలిచిన లెఫ్ట్‌ ఫ్రంట్‌ 11.13 శాతం ఓట్లను మూటగట్టుకుంది. 

బీజేపీ సాధించిన ఓట్ల(8.94శాతం ఓట్లు)తో పోలిస్తే సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌ సాధించిన ఓట్లే ఎక్కువ కావడం గమనార్హం. దీంతో సాధించిన ఓట్ల పట్టికలో లెఫ్ట్‌ ఫ్రంట్‌ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ మూడు, కాంగ్రెస్‌ రెండు వార్డులను గెల్చుకున్నాయి. గత కేఎంసీ ఎన్నికలతో పోలిస్తే టీఎంసీ ఈసారి 22 శాతం ఓట్లు ఎక్కువ సాధించింది. బీజేపీకి గతంతో పోలిస్తే ఆరు శాతం తక్కువ ఓట్లు పడ్డాయి.

చదవండి: (S-400 Air Defence System: బోర్డర్‌లో ‘బాహుబలి’) 

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కేఎంసీ ప్రాంతంలో సాధించిన ఓట్ల కంటే ఈసారి బీజేపీ ఏకంగా 20 శాతం తక్కువ ఓట్లు పడ్డాయి. విపక్షాల ఓటు బ్యాంక్‌ను బద్దలుకొట్టాలని టీఎంసీ కుట్ర పన్నిందని, ఆ క్రమంలోనే లెఫ్ట్‌ ఫ్రంట్‌ పుంజుకుందని బీజేపీ ఆరోపించింది. 145 ఏళ్ల చరిత్ర ఉన్న కేఎంసీ ఎన్నికల్లో ఈసారి 40.5 లక్షల మంది ఓట్లేశారు. టీఎంసీ సాధించిన విజయంపై ఆ పార్టీ చీఫ్‌ మమతా బెనర్జీ మాట్లాడారు. ‘ఈ విజయం రాష్ట్ర ప్రజలకు అంకితం. టీఎంసీ భవిష్యత్‌ జాతీయ రాజకీయ ప్రస్థానానికి ఈ విజయం మేలిమి బాటలు పరుస్తోంది’ అని ఆమె వ్యాఖ్యానించారు. 

చదవండి: (మహిళా వివాహ వయసు పెంపు.. వాళ్లని బాధిస్తోంది)

మరిన్ని వార్తలు