మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. 12 మందికి చోటు!

8 Aug, 2022 16:44 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో ఉద్ధవ్‌ థాక్రే ప్రభుత్వం పడిపోయి.. బీజేపీ మద్దతుతో శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే సీఎం పీఠాన్ని అధిరోహించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి నెల రోజులు గడిచిపోయినా మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. సీఎం షిండే, దేవేంద్ర ఫడ్నవీస్‌లు పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిశారు. తాజాగా ఆ ఉత్కంఠకు తెరపడింది. మంగళవారం మంత్రివర్గ విస్తరణ ఉండనుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. బీజేపీ, షిండే సేనల నుంచి మొత్తం 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని పేర్కొన్నాయి. ఒక్కో ప్రాంతానికి ఒక్కో మంత్రి చొప్పున 12 మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. 

బీజేపీ నుంచి సీనియర్‌ నేత సుధీర్‌ ముంగంటివార్‌, చంద్రకాంత్‌ పాటిల్‌, గిరిష్‌ మహజన్‌, షిండే వర్గం నుంచి గులాబ్‌ రఘునాథ్‌ పాటిల్‌, సదా సర్వాంకర్‌, దీపక్‌ వసంత్‌ కేసర్కార్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరు మంగళవారం కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారని సమాచారం.

శివసేన ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌లు సీఎం, డిప్యూటీ సీఎంలుగా జూన్‌ 30న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఆ ఇరువురే ద్విసభ్య కేబినెట్‌ను నడుపుతున్నారు. దీంతో విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఫడ్నవీస్‌, షిండేలు పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిశారు. మంత్రివర్గ విస్తరణ ఆలస్యమవుతుండటంతో ఎలాంటి ఇబ్బంది లేదని, త్వరలోనే మరింత మందిని కేబినెట్‌లోకి తీసుకుంటాని గత శనివారం తెలిపారు షిండే.

ఇదీ చదవండి: శరద్‌ పవార్‌ ‘కంచుకోట’పై బీజేపీ కన్ను.. కేంద్ర మంత్రికి బాధ్యతలు

మరిన్ని వార్తలు