నెత్తుటి జాడ.. నేరాల నీడ

2 Feb, 2021 19:15 IST|Sakshi

సాధారణ గ్రామంలో దారుణ సంఘటనలు

ఏళ్ల తరబడి ఎన్నో నేరాలు.. ఘోరాలు

ఓ కుటుంబాన్ని ఎదిరిస్తే అంతే సంగతులు

నిమ్మాడలో నామినేషన్‌ ఉదంతంతో పునరావృతమైన పరిణామాలు

అనగనగా ఒక ఊరు.. అందులో ఓ కుటుంబం అరాచకాల జోరు. అనేక సందర్భాల్లో చిందే నెత్తురు.. ఆ ఘోరాలను ఎదురొడ్డేందుకు వచ్చేవారు సోదిలోకి కూడా మిగలరు. చివరికి హీరో రంగస్థల ప్రవేశం.. కథ క్లైమాక్స్‌కు చేరడం.. ఇదీ చాలా సినిమాల తీరు. అయితే ఈ సంఘటనలు కేవలం వెండితెరపై సినీగాథలకే పరిమితమౌతాయనుకుంటే పొరపాటని మన కళ్లెదుట జరుగుతున్న పరిణామాలే రుజువు చేస్తున్నాయి. కొన్ని పల్లెలు అరాచకానికీ, అకృత్యాలకు ఇప్పటికీ నెలవులేనని సాక్ష్యాధారాలుగా నిలుస్తున్నాయి. నేర రంగస్థలాలు బడానేతల ఇలాకాల్లోనే ఉన్నాయని నిమ్మాడలో ఆదివారం జరిగిన నామినేషన్‌ నిరోధక ఘట్టానికి సంబంధించిన వైపరీత్యాలే చాటి చెబుతున్నాయి. ఈ వ్యవహారం ఏదో విపరిణామమే అని సరిపెట్టుకుందామంటే.. ఏళ్ల తరబడి చిందిన రక్తం మరకలు.. కాలువ కట్టిన బాధితుల కన్నీటి చారికలు.. గతంలో జరిగిన ఘోరాల ఊసేమిటని సమాజాన్ని నిలదీసి ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల అధికారులూ.. చూశారా.. చూస్తున్నారా? 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  నిమ్మాడలో కింజరాపు కుటుంబానికి కాదని సర్పంచ్‌గా నామినేషన్‌ వేసిన కింజరాపు సూరయ్య... ఆయన ఇంటిలోనే హత్యకు గురయ్యారు.      
కింజరాపు కుటుంబీకులకు వ్యతిరేకంగా నిలిచిన ఎచ్చెర్ల సూర్యానారాయణ చిట్టయ్యవలస తోటలో శవమై తేలారు.     
కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబీలకు ఎమ్మెల్యేగా పోటీకి అడ్డుపడిన కింజరాపు భుజంగరావు (బుజ్జి) కత్తులతో హత్యకు గురయ్యారు. 
నిమ్మాడ రాజకీయంలో కొంచాడ బాలయ్య అనే వ్యక్తి శవమయ్యాడు.   
పిన్నింటిపేటలో రిగ్గింగ్‌కు అడ్డుపడ్డ కూన రామారావు 1994లో డిసెంబర్‌ 3న కత్తిపోట్లతో మరణించారు.  
గ్రామానికి చెందిన కింజరాపు గణపతి కుమార్తె మేనకమ్మను మహిళ అని చూడకుండా విచక్షణా రహితంగా అక్కడే వివస్త్రను చేశారు.  

ఇలా చెప్పుకుని పోతే కింజరాపు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా పనిచేసిన అనేక మంది హత్యలకు గురయ్యారు. వాటి వెనక ఎవరున్నారో చనిపోయిన వారి శత్రువులకు తెలియాలి. నిమ్మాడ రాజకీయమంటే అలాగే ఉంటుందనేది అందరి నోట మాట. వాస్తవానికైతే, కింజరాపు కుటుంబీకులపై అసంతృప్తితో ఉన్న వారు అనేక మంది ఉన్నారు. చాప కింద నీరులా కోపోద్రిక్తులై ఉన్నారు. కాకపోతే, గత సంఘటనల నేపథ్యంలో ఏ ఒక్కరూ బయటకు రావడం లేదు. నోరు మెదపడం లేదు. కాస్త ధైర్యం చేసి ముందుకొచ్చిన వారు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.(చదవండి: అప్పన్నపై దాడి.. అచ్చెన్న అరెస్ట్‌)

తొలుత బెదిరింపులు.. ఆ తర్వాత దౌర్జన్యాలు... అప్పటికీ లొంగకపోతే సామాజిక, గ్రామ బహిష్కరణలు.. ఇంకా వినకపోతే దాడులు చేయడం నిమ్మాడలో పరిపాటిగా మారిపోయింది. ఏళ్ల క్రితం నుంచి 18 ఎకరాల రైతు మెండ రామ్మూర్తిని ఇబ్బంది పెడుతున్న విషయం అందరికీ తెలిసిందే. తర్వాత కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబీకులకు వారికి వరసకు అన్న కుమారుడైన కింజరాపు అప్పన్న టార్గెట్‌ అయ్యారు. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో అప్పన్నను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.  కింజరాపు అప్పన్న భార్య చంద్రకళ మెళియాపుట్టి కేజీబీవీలో హిందీ పండిట్‌గా పనిచేసేవారు. 2014లో మంత్రి అయ్యాక ఆమెను తొలగించారు. దీనికంతటికీ అచ్చెన్నాయుడే కారణమని భర్త అప్పన్న ఆరోపణ.

అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్‌ వద్ద 15 ఏళ్ల క్రితం రూ.2లక్షలను అప్పన్న అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తమంతా చెల్లించినప్పటికీ  ముందుగా రాసుకున్న నోటు ఈ రోజుకూ ఇవ్వలేదని అప్పన్న మొర పెట్టుకూనే వస్తున్నారు. ఇదే విషయాన్ని కింజరాపు అచ్చెన్నాయుడు తనకు ఫోన్‌ చేసినప్పుడు అప్పన్న బల్ల గుద్ది చెప్పారు. నీకు జరిగిన అన్యాయం, నష్టం తెలుసునని, అవన్నీ సరి చేసుకుందామని అచ్చెన్నాయుడు ఒక సందర్భంలో ఒక మెట్టు దిగి ఫోన్‌లో అప్పన్నకు సర్ది చెప్పేలా మాట్లాడారు. అయినప్పటికీ అప్పన్న వెనక్కి తగ్గలేదు. వారికి పోటీగా నిమ్మాడ సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ వేయాలని నిర్ణయించుకున్నారు. హరిప్రసాద్‌ తదితరులు దాడి చేసినప్పటికీ భయపడకుండా నామినేషన్‌ వేశారు.

అచ్చెన్న కుటుంబీకులకు టార్గెట్‌ అవడం వెనక అప్పన్నపై ఉన్న ద్వేషమే కారణం. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆ పార్టీకి ఏజెంట్‌గా, ప్రస్తుతం వైఎస్సార్‌సీపీకి బూత్‌ ఏజెంట్‌గా ఉన్నారన్న అక్కసుతోనే అప్పన్నను తొక్కేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబానికి అక్కడ వ్యతిరేకంగా ఎవరున్నా ఇబ్బంది పడక తప్పడం లేదు. ఇప్పుడు వారికొక పోటీగా అప్పన్న నిలవడం నిమ్మాడ, టెక్కలి నియోజకవర్గంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు