ఈటల మోసానికి.. గెల్లు విధేయతకు మధ్య పోటీ

11 Oct, 2021 01:47 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

సాక్షి, హుజూరాబాద్‌(కరీంనగర్‌): హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఈటల రాజేందర్‌ మోసానికి.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ విధేయతకు మధ్య జరుగుతున్న పోరు అని, నియోజకవర్గ ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు. బీజేపీ పట్టణాధ్యక్షుడు నందగిరి మహేందర్‌రెడ్డితోపాటు మరికొందరు మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా హుజూరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో హరీశ్‌రావు మాట్లాడుతూ, ఈటల రాజేందర్‌ ఎక్కడ మాట్లాడినా తాను ప్రజలకు ఏం చేస్తాడో చెప్పకుండా, తనపై దాడి జరిగే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అన్నిరకాలుగా రాజేందర్‌కు రక్షణ ఇస్తుందని చెప్పారు. ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్‌ ధరను కేంద్రం పెంచుతోందని, సిలిండర్‌కు దండం పెట్టి బీజేపీని కసిగా ఓడించాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. నాలుగు నెలలకింద బీజేపీ చెడ్డ పార్టీ అన్నావని, ఇప్పుడు మంచి పార్టీ ఎలా అయిందని ఈటలను ప్రశ్నించారు.

బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను పెట్టాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిందని, దీనిపై ఈటల స్పందించాలని డిమాండ్‌ చేశారు. తాను, గంగుల కమలాకర్, గెల్లుతో కలిసి ఇచ్చిన ప్రతిమాటా నిలబెట్టుకుంటామన్నారు. ‘టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల కోసం, సంక్షేమం కోసం పాటుపడే పార్టీ. గెల్లు పేదబిడ్డ, శ్రీమంతులు ఎవరో? పేదింటి బిడ్డ ఎవరో ప్రజలు గమనించి న్యాయాన్ని గెలిపించాలని మంత్రి కోరారు.  

చదవండి: బీసీ కులగణనపై కాంగ్రెస్‌ వైఖరేంటి?: జాజుల

మరిన్ని వార్తలు