బడ్జెట్‌పై కాంగ్రెస్‌ పెడార్థాలు తీస్తోంది

13 Feb, 2021 04:22 IST|Sakshi

రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శలు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ఇటీవల తాము ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ప్రతిపక్షాలు అపార్థాలు సృష్టిస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆరోపించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ రహదారుల నిర్మాణం, పేదలకు పక్కా ఇళ్లు, ఉచితంగా వంటగ్యాస్, రేషన్‌ పంపిణీ వంటివి చేపడుతున్నా మోదీ ప్రభుత్వం ధనికులకు అనుకూల మంటున్నాయని విమర్శించారు. శుక్రవారం మంత్రి రాజ్యసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చకు సమాధానమిచ్చారు. కోవిడ్‌ మహమ్మారితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమైన తరుణంలో ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ సాధనకు బడ్జెట్‌ ఒక ఆయుధమని ఆమె అభివర్ణించారు. ‘స్వల్పకాలిక తక్షణ పరిష్కారాలను వెదకడానికి బదులుగా ఆర్థిక వ్యవస్థపై గుణాత్మక ప్రభావం చూపే ఉద్దీపనను, గట్టి ఉద్దీపనను కల్పించేందుకు ఈ బడ్జెట్‌లో ప్రయత్నం జరిగింది.

ఈ క్లిష్ట సమయంలో సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు స్వల్ప కాలిక చర్యలు తీసుకుంటూనే మాధ్యమిక, దీర్ఘ కాలిక స్థిరవృద్ధి సాధనకు చర్యలు ప్రకటించాం’ అని తెలిపారు. దేశంలోని పేదలు, బడుగు వర్గాలకు సాయపడేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నా, ప్రభుత్వం కొందరు పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తోందన్న ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం ఆగడం లేదు’ అని అన్నారు. ‘మా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మార్కెట్‌ప్లేస్, యూపీఐలను కొందరు ధనికులు, కొందరు అల్లుళ్లే వినియోగిస్తున్నారా?’ అంటూ మంత్రి వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్‌ సభ్యులు అభ్యంతరం తెలిపారు. బడ్జెట్‌లో పేర్కొన్న అంకెలపై మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అనుమానం వ్యక్తం చేయడంపై ఆమె స్పందిస్తూ..‘యూపీఏ హయాంలో అభివృద్ధి సాధించినట్లు చూపేందుకు కృత్రిమ గణాంకాలతో వ్యయాన్ని పెంచారు. సబ్సిడీని ప్రభుత్వ బడ్జెట్‌ నుంచి కంపెనీలకు తరలించారు. కానీ, 2021–22 బడ్జెట్‌లో పారదర్శకత పాటిస్తూ వ్యయ వివరాలన్నీ స్పష్టంగా పేర్కొన్నాం’అని తెలిపారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు