రాహుల్ గాంధీనే సరైనోడు.. మరెవరికీ అంత క్రేజ్‌ లేదు

27 Aug, 2022 14:52 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యం‍లో ఆ పార్టీ రాజ్యసభా పక్షనేత మల్లికార్జున్ ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీనే చేపట్టేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామన్నారు. ఆయనలా దేశవ్యాప్తంగా ఆదరణ గల నేతలెవరూ కాంగ్రెస్‌లో లేరని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వ్యక్తికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు మద్దతు ఉండాలని ఖర్గే అన్నారు. దేశవ్యాప్తంగా అందరూ ఆమెదించేలా, అత్యంత జనాదరణ కలిగిన నేత అయి ఉండాలన్నారు. పార్టీలో రాహుల్ మినహా అలాంటి వ్యక్తులెవరూ లేరని ఖర్గే అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే అధ్యక్ష ఎన్నికలకు ముందే చాలా మంది నేతలు రాహుల్ గాంధీనే పార్టీ పగ్గాలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారని చెప్పారు. 

అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ సుముఖంగా లేరని ప్రచారం జరుగుతన్న తరుణంలో ఈ విషయంపై ఖర్గే స్పందించారు. ఆయన సుముఖంగా లేకపోయినా పార్టీ నేతలమంతా కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. పార్టీ కోసం, దేశం కోసం, ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీపై పోరాటం చేసేందుకు పగ్గాలు చేపట్టాలని కోరతామన్నారు. అవసరమైతే బలవంతం చేస్తామన్నారు. అందరం ఆయన వెనకాలే ఉండి ఒప్పించే ప్రయత్నం చేస్తామన్నారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం అనంతరం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు రాహుల్ గాంధీ. ఆ తర్వాత తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు చేపట్టారు. నూతన అధ్యక్షుడి కోసం ఎన్నికలు ఎప్పుడో జరగాల్సి ఉన్నా.. వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి. చివరకు సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. అయితే ఈసారి కూడా మళ్లీ వాయిదా పడే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. కొన్నివారాల పాటు ఆలస్యమవుతాయని పేర్కొన్నాయి.
చదవండి: మాజీ ఎమ్మెల్యే ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌.. ఆజాద్‌ రాజీనామా అందుకేనా?

మరిన్ని వార్తలు