‘బీజేపీ ఎంపీలది శిఖండి పాత్ర’

4 Jan, 2022 01:58 IST|Sakshi

 ఒమిక్రాన్‌ నిబంధనలకు లోబడే రైతు సంబురాలు 

సీఎం గురించి ఇష్టారీతిగా మాట్లాడితే చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించేవిధంగా బీజేపీ ఎంపీలు శిఖండి పాత్ర పోషిస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రప్రగతిని అడ్డుకునేందుకు కొన్నిశక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో సోమవారం పార్టీ నేతలు ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డి, లింగంపల్లి కిషన్‌రావు, రూప్‌సింగ్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుబంధు ద్వారా ఇప్పటివరకు రైతుల బ్యాంకుఖాతాల్లో రూ.50 వేలకోట్లు వేసిన చరిత్ర టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా మారిందని, రైతుసంక్షేమం గురించి అనేక రాష్ట్రాలు తెలంగాణను చూసి నేర్చుకుంటున్నాయని పేర్కొన్నారు. ఒమిక్రాన్‌ నిబంధనలకు లోబడే రైతుబంధు సంబురాలు చేసుకోవాలని తాము రైతులకు పిలుపునివ్వడం కొందరు కుహనా రాజకీయ నాయకులకు ఇబ్బందిగా మారిందని పల్లా విమర్శించారు. రైతుబంధుతో రైతులు సోమరిపోతులు అవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేయడాన్ని పల్లా ఖండిస్తూ, ఆయన రైతులను కించపరిచేలా మాట్లాడారని ఆరోపించారు.

రైతుబీమా పథకం కింద రాష్టంలో ఇప్పటివరకు 70,714 మంది రైతు కుటుంబాలకు బీమా పరిహారం ఇచ్చామని చెప్పారు. ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేల కొనుగోలు కేంద్రాల ద్వారా 68 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. రాష్ట్రంలో లేని ఆత్మహత్యలను ఉన్నట్లుగా చిత్రీకరించేందుకు రైతు స్వరాజ్యవేదిక అనే సంస్థ ప్రయత్నిస్తోందని, అది ఆంధ్రా నాయకులు పెట్టుకున్న వ్యాపార సంస్థ అని పల్లా ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ఫొటోలను మార్ఫింగ్‌ చేస్తూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానిస్తే సహించేది లేదని హెచ్చరించారు.   

మరిన్ని వార్తలు