ఒంటరైన ముఖ్యమంత్రి: 62 మంది ఎమ్మెల్యేలకు సిద్ధూ విందు

21 Jul, 2021 15:42 IST|Sakshi
తన నివాసంలో ఎమ్మెల్యేలతో సమావేశమైన నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ (ఫొటో: ఇండియా టుడే)

ఛండీగఢ్‌: పంజాబ్‌లో ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ఒంటరవుతున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ తాజాగా బుధవారం అల్పాహార విందు ఏర్పాటుచేశాడు. ఈ విందుకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 62 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. దీంతో ముఖ్యమంత్రి బలం తగ్గినట్టు కనిపిస్తోంది. అయితే ఈ అల్పాహార విందుకు కొందరు అనివార్య కారణాలతో రాలేనట్లు తెలుస్తున్నా వారంతా ముఖ్యమంత్రి వర్గానికి చెందిన వారు. తాజా పరిణామంతో సీఎం అమరీందర్‌ సింగ్‌ ఒంటరైనట్లు తెలుస్తోంది. 80 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉండగా వారిలో 62 మంది హాజరు కావడంతో సీఎం బలం తగ్గినట్టే. ఈ సమావేశం అనంతరం ‘గాలిలో మార్పులు’ అంటూ సిద్ధూ ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

వద్దని వారిస్తున్నా సిద్దూకు పార్టీ రాష్ట్ర బాధ్యతలు అధిష్టానం అప్పగించడంతో సీఎం అమరీందర్‌ సింగ్‌ అసహనంతో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైనప్పటి నుంచి సిద్ధూ సీఎం అమరీందర్‌ సింగ్‌ను కలవలేదు. సిద్ధూ క్షమాపణ కోరితేనే తనను కలిసేందుకు అవకాశం ఇస్తానని సీఎం వర్గీయులు చెబుతున్నారు. దీనికి సిద్ధూ ససేమిరా అంటున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. పార్టీ అధ్యక్షుడు అల్పాహార విందు ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రిని కాదని వెళ్లారు. ఆ విందుతో సిద్దూ వేరే కుంపటి పెట్టినట్టుగా మారింది. కొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతుండడంతో అధిష్టానం ఆశీర్వాదం ఉన్న సిద్ధూకు పార్టీ ఎమ్మెల్యేలంతా జై కొట్టారు. సిద్దూ ఆధ్వర్యంలోనే ఎన్నికలకు కాంగ్రెస్‌ సిద్ధం కాబోతోంది.

ఈ పరిణామంతో పార్టీ సీనియర్‌ నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీ తనను పట్టించుకోకపోవడంపై గుస్సాగా ఉన్నారు. అధిష్టానం పట్టించుకోకపోవడం.. వయసు మీదపడడం వంటి సమస్యలతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉండేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ కాలం అయిపోయేంత వరకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికల అనంతరం ఫలితాలు ఎలా ఉన్నా ఆయన రాజకీయ సన్యాసం చేసే అవకాశాలు ఉన్నాయి.

117 అసెంబ్లీ స్థానాలు ఉన్న పంజాబ్‌లో కొన్ని నెలల్లోనే ఎన్నికలు రానున్నాయి. ప్రస్తుతం పంజాబ్‌లో బలాబలాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్‌ 80, ఆమ్‌ ఆద్మీ పార్టీ 16, శిరోమణి అకాలీదల్‌ 14, బీజేపీ 2, ఎల్‌ఐపీ 2 ఉండగా.. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మరోసారి ప్రభుత్వంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ తీవ్రంగా శ్రమిస్తోంది. రైతుల పోరాటానికి కాంగ్రెస్‌ మద్దతుగా ఉండడం కలిసొచ్చే అవకాశం ఉంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదల్‌ కాంగ్రెస్‌కు గట్టిపోటీని ఇచ్చేలా ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు