PM Narendra Modi: ఎన్నికల్లో ‘ఉచిత హామీలు’ దేశాభివృద్ధికి ప్రమాదకరం

16 Jul, 2022 15:28 IST|Sakshi

లక్నో: ఉచిత హామీలతో ఓట్లు అడిగే విధానంపై ప్రజలను హెచ్చరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అది ఒక 'స్వీట్‌ కల్చర్‌' అంటూ అభివర్ణించారు. ఉచిత హామీలు దేశాభివృద్ధికో ఎంతో ప్రమాదకరమని పేర్కొన్నారు. 296 కిలోమీటర్ల బుందేల్ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభించిన అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌, జలాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు మోదీ. 

ఉత్తర్‌ప్రదేశ్‌లో గత ప్రభుత్వాలు, పాలకులపై విమర్శలు గుప్పించారు మోదీ.' వేగవంతమైన అనుసంధానతతో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం.. రాష్ట్రంలో ప్రధాన మార్పులు తీసుకొస్తోంది. బుందేల్ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ద్వారా చిత్రకూట్‌ నుంచి దిల్లీ చేరుకునేందుకు 3-4 గంటల సమయం తగ్గుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌ వే వాహనాల స్పీడ్‌ పెంచటమే కాకుండా పరిశ్రమల అభివృద్ధిని సైతం పరిగెట్టేలా చేస్తుంది. రెవారి(ఒకరకమైన స్వీట్‌) సంస్కృతి దేశాభివృద్ధికి చాలా ప్రమాదకరం. దేశ ప్రజలు ముఖ్యంగా యువత దీనిని గుర్తుంచుకోవాలి. దేశాభివృద్ధి ముఖ్య ఉద్దేశం, గౌరవం అనే రెండు అంశాలపై ఆధారపడి ముందుకు సాగుతోంది. ప్రస్తుత అవసరాల కోసమే సౌకర్యాలను ఏర్పాటు చేయటం లేదు, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేస్తున్నాం'  అని పేర్కొన్నారు మోదీ. 

బుందేల్ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే విశేషాలు.. 
బుందేల్ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఏడు జిల్లాల గుండా దిల్లీకి చేరుకుంటుంది. దీనిని సుమారు రూ.14,850 కోట్లు వ్యయంతో నిర్మించారు. 2020, ఫిబ్రవరి 29న శంకుస్థాపన చేయగా.. 28 నెలల్లోనే దీనిని పూర్తి చేశారు. సుమారు 296 కిలోమీటర్లు  ఉంటుంది. ఉత్తర్‌ప‍్రదేశ్‌లోని చిత్రకూట్‌ నుంచి దిల్లీకి చేరుకునేందుకు గతంతో పోలిస్తే సుమారు 3-4 గంటల సమయం ఆదా అవుతుంది. 

ఇదీ చూడండి: Gujarat Riots: గుజరాత్‌ అల్లర్ల వెనుక షాకింగ్‌ నిజాలు.. మోదీని గద్దె దింపేందుకే కాంగ్రెస్‌ ప్లాన్‌!

మరిన్ని వార్తలు