Prashant Kishor: 600 స్లయిడ్‌లతో ‘పీకే’ ప్రణాళిక

22 Apr, 2022 16:58 IST|Sakshi

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వరుస ఓటములతో కుదేలైన హస్తం పార్టీకి జవసత్వాలు తొడిగేందుకు ఆయన తనదైన ప్రణాళిక రచించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధినాయకులతో వరుస మంతనాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా రెండు వారాల్లో మూడో పర్యాయం సోనియా గాంధీతో భేటీలు నిర్వహించారు. బేషరతుగా ఆయన తమ పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారని కాంగ్రెస్‌ వర్గాల సమాచారం. 

2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్‌ 2.0 ప్రణాళికను పీకే టీమ్‌ తయారు చేసినట్టు తెలుస్తోంది. 600 స్లయిడ్‌లతో కూడిన ఈ ప్రణాళికను ఇప్పటివరకు కాంగ్రెస్‌ నేతలెవరూ చూడలేదని..  సోనియా కుటుంబ సభ్యులకు మాత్రమే సూచనప్రాయంగా వెల్లడించినట్టు సమాచారం. కాంగ్రెస్‌ పునరుద్ధరణ ప్రణాళికలో ఏయే అంశాలు పొందుపరిచారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 

అయితే గతంలో ప్రతిపాదించిన అంశాలే కాంగ్రెస్‌ 2.0 ప్రణాళికలోనూ ఉండే అవకాశముందని పలు జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. 1984 నుంచి 2019 వరకు కాంగ్రెస్‌ పతనాన్ని ప్రస్తావిస్తూ, అందుకు గల కారణాలను ప్రణాళికలో పేర్కొన్నట్టు సమాచారం. వారసత్వ ముద్ర, వ్యవస్థాగత లోపాలు, ప్రజలకు చేరువకాలేకపోవడం, విజయాలను నిలబెట్టుకోలేకపోవడం వంటి అంశాలను ప్రధానంగా స్పృశించినట్టు తెలుస్తోంది. పార్టీ నాయకత్వ ఎంపిక ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని సూచించినట్టు సమాచారం. 

సోనియా గాంధీ అధ్యక్షురాలిగా కొనసాగాలని..  రాహుల్ గాంధీని పార్లమెంటరీ బోర్డు చీఫ్‌గా నియమించాలని ప్రతిపాదించారు. కాంగ్రెస్ నాయకత్వం నిర్దేశించిన విధంగా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పని చేయడానికి గాంధీయేతర కుటుంబానికి చెందిన వారిని వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా వైస్ ప్రెసిడెంట్‌ చేయాలని పేర్కొన్నారు. పార్టీ పదవులన్నింటికీ నిర్ణీత పదవీ కాలం ఉండాలన్నారు. (క్లిక్: జహంగీర్‌పురి కూల్చివేతలు.. సారీ చెప్పిన కాంగ్రెస్‌ నేత)

పొత్తులపై స్పష్టమైన వైఖరి, పార్టీ వ్యవస్థాపక సిద్ధాంతాలకు కట్టుబడటం, క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలతో బలమైన సంస్థాగత సైన్యం, మీడియా, డిజిటల్ ప్రచారానికి పటిష్టమైన యంత్రాంగం కావాలని ప్రణాళికలో సూచించినట్టు సమాచారం. వారసత్వ రాజకీయాలను నియంత్రించడానికి ‘ఒక కుటుంబం, ఒక టికెట్‌’ విధానం అమలు చేయాలని కూడా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ 2.0 ప్రణాళికలో ఇవే అంశాలు ఉంటాయా, ఇంకా ఏమైనా మార్పులు చోటుచేసుకుంటాయా అనేది తొందరలోనే తెలిసే అవకాశముంది. (క్లిక్: ప్రశాంత్‌ కిషోర్‌ అంటేనే ఓ బ్రాండ్‌)

మరిన్ని వార్తలు