భారీ ఎత్తున నిరసనలు.. సీఎం నివాసం ముట్టడి

15 Jun, 2021 15:38 IST|Sakshi

చండీగఢ్‌/సిస్వాన్‌: పంజాబ్‌ ప్రభుత్వ తీరును నిరసిస్తూ శిరోమణి అకాళీదళ్‌ నేతలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ నివాసాన్ని మంగళవారం ముట్టడించారు. ఆరోగ్య మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. కోవిడ్‌ నిబంధనలు పట్టించుకోకుండా భారీ సంఖ్యలో ఆందోళనకారులు ఒక్కసారిగా దూసుకురావడంతో సీఎం ఇంటి వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు శిరోమణి అకాళీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 

తుపానును ఆపలేరు
ఈ సందర్భంగా సుఖ్‌బీర్‌సింగ్‌ మాట్లాడుతూ... ‘‘తన బలగాన్నంతా ఉపయోగించినప్పటికీ.. ఇప్పుడు చెలరేగిన తుపానును కెప్టెన్‌ ఆపలేరు. వ్యాక్సినేషన్‌లో కుంభకోణం.. ఫతే కిట్‌ కిట్‌లో స్కాం.. ఎస్సీ స్కాలర్‌షిప్‌ విషయంలోనూ ఇదే తంతు... రైతుల నుంచి భూసేకరణ అంశంలోనూ ఇదే రకమైన వైఖరి’’ అంటూ అమరీందర్‌ సింగ్‌ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.కాగా పోస్ట్‌ మెట్రిక్‌ ఉపకారవేతన నిధుల అంశంలో అవకతవకలు జరిగాయంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు సోమవారం సీఎం అధికారిక నివాసాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే.

ఆప్‌ ఎమ్మెల్యే హర్పాల్‌ సింగ్‌ చీమా నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ సామాజిక సంక్షేమ మంత్రి సధూ సింగ్‌ ధరమ్‌సోత్‌ను పదవి నుంచి తొలగించాలంటూ డిమాండ్‌ చేశారు. తక్షణమే ఉపకార వేతన బకాయి నిధులను విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోగా ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక అణగారినవర్గాలకు అందాల్సిన స్కాలర్‌షిప్‌నకు సంబంధించిన 64 కోట్ల నిధులు దారి మళ్లాయంటూ గతేడాది అమరీందర్‌ సింగ్‌ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ అంశంపై విచారణ చేపట్టాల్సిందిగా  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆయన ఆదేశించారు.

చదవండి: ఎన్నికల వేళ: మాయావతికి ఎదురుదెబ్బ

మరిన్ని వార్తలు