సీమలో అలజడికి కుట్ర

9 Dec, 2021 05:06 IST|Sakshi

పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు మినహా ఇతరులు లేరు: సజ్జల 

వడ్డీ కూడా మాఫీ చేయని పెద్ద మనిషి ఓటీఎస్‌పై విష ప్రచారం 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల్లో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చోటు

సాక్షి, అమరావతి: అమరావతి యాత్ర పేరుతో రాయలసీమలో అలజడి సృష్టించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు మినహా ఇతరులు ఒక్కరు కూడా లేరన్నారు. చంద్రబాబుపై ప్రజలకు నిజంగా అభిమానం ఉంటే అమరావతి ప్రాంతంలోనూ వరుసగా ఎన్నికల్లో ఎందుకు ఛీకొడతారని ప్రశ్నించారు. ప్రజలు తమ కోసం పరితపించే నాయకుడిని నెత్తిన పెట్టుకుంటారని, గతంలో వైఎస్సార్‌ ఇప్పుడు సీఎం జగన్‌ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారని చెప్పారు.

బుధవారం శాసనమండలి నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులతో కలసి పాల్గొని మాట్లాడారు. సంపూర్ణ మెజార్టీతో సజావుగా అభివృద్ధి సంక్షేమం, అభివృద్ధి నినాదంతో సమాజంలో విప్లవాత్మక మార్పుల దిశగా ప్రభుత్వం సాగుతోందని సజ్జల తెలిపారు. ప్రజలు తిరస్కరించిన ప్రతిపక్ష టీడీపీ మండలిలో ఇన్నాళ్లూ సాంకేతికంగా ఇబ్బందులు సృష్టించిందన్నారు. ఇప్పుడు ఉభయ సభల్లో వైఎస్సార్‌సీపీ పూర్తి మెజార్టీ సాధించడంతో రాష్ట్రం పురోభివృద్ధి దిశగా సునాయాసంగా ముందుకు సాగుతుందన్నారు.

కౌన్సిల్‌లో 32 మంది ఎమ్మెల్సీల్లో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చోటు కల్పించామని వివరించారు. గతంలో వడ్డీ కూడా మాఫీ చేయని పెద్దమనిషి, ఆయన పార్టీ సభ్యులు, వారికి కొమ్ముకాసే ప్రసార సాధనాలు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకంపై విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాభివృద్ధిని అడ్డుకునే ప్రతిపక్ష నాయకుడు, పార్టీ ఉండటం రాష్ట్రం దౌర్భాగ్యమన్నారు. ఇన్నాళ్లూ చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుని ఏజెంట్లతో కుప్పాన్ని ఏలుతూ వచ్చారని, ఈసారి ప్రజలు టీడీపీని ఊడ్చేశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు 70 ఏళ్లు, టీడీపీకి 40 ఏళ్లు రావడంతో అవసాన దశలో ఉన్నాయన్నారు. 

మరిన్ని వార్తలు