నోరు తెరిస్తే ట్రోలే!.. మాట తూలుతున్న అచ్చెన్న..

28 Mar, 2022 21:23 IST|Sakshi

సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పార్టీ లేదు.. బొక్కా లేదు.. వాడే(లోకేష్‌) మంచిగా ఉంటే పార్టీకి ఈ గతి ఎందుకు పడుతుంది’.. లోకేష్‌ను ఉద్దేశించి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. 

చంద్రబాబు నీతిమాలిన మాటలు ఆడుతున్నారు’.. పార్టీ అధినేతపై రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో తాజాగా అచ్చెన్న నోటి నుంచి వెలువడిన మాటలివి. 

‘ఆడొచ్చి చంద్రబాబునాయుడుకు ఒక చెక్కు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు అది తీసుకున్నాడు. చెక్కు కాదు వాడు ఆస్తి రాసి ఇమ్మను. పార్టీ వాడుకుంటుంది. మామిడి గోవిందరావుకు టిక్కెట్‌ ఆలోచన ఎందుకు. కలలో కూడా అది ఊహిస్తారా?..’ టీడీపీ గురించి వివరిస్తూ ఇటీవలే అచ్చెన్నాయుడు చేసిన సంభాషణ ఇది.

చదవండి: లావాదేవీలే లేకుండా అవినీతా? 

పొరపాటున జరుగుతున్నాయో, మనసులో ఉన్నవే బయటకు వస్తున్నాయో గానీ అచ్చెన్న నోరు తెరిస్తే చాలు ఆ మాటలు ట్రోల్‌ అవుతున్నాయి. వరుసగా నోరు జారుతున్న అచ్చెన్నాయుడు నెటిజన్లకు కావాల్సినంత వినోదం పంచుతున్నారు. ఫేస్‌ బుక్, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోలు విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి.

అచ్చెన్నాయుడు చేసిన ప్రతి వ్యాఖ్య అచ్చుగుద్దినట్టు టీడీపీ పరిస్థితులకు తగ్గట్టుగా ఉండటంతో మీమర్లు సైతం రెచ్చిపోతున్నారు. ఇది పార్టీకి ఓ తలనొప్పిగా మారింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో హుందా గా ప్రవర్తించాల్సిన నాయకుడు ఇలా లేనిపోని వ్యాఖ్యలు చేస్తూ చిక్కులు తెచ్చి పెడుతున్నారు. లోకేష్‌ విషయంలో తిరుపతిలోనూ, పార్టీ నాయకులపై తన సొంత ఊరిలోనూ, చంద్రబాబుపై అమరావతిలోనూ అచ్చెన్నాయుడు ఓపెన్‌గా చేసిన వ్యాఖ్యలపై పార్టీలో కూడా పెద్ద ఎత్తునే చర్చ జరుగుతున్నట్లు సమాచారం.     

మరిన్ని వార్తలు