3 రాజధానులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

1 Aug, 2020 03:20 IST|Sakshi
మాట్లాడుతున్న సోము వీర్రాజు. చిత్రంలో జీవీఎల్, దేవ్‌ధర్‌

రాజధాని రైతులకు న్యాయం చేయాలి

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

చంద్రబాబునాయుడు మూర్ఖంగా నిర్ణయాలు తీసుకున్నారు

బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు

సాక్షి, న్యూఢిల్లీ: మూడు రాజధానులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. దీనిపై తమ ఆలోచనలను విస్పష్టంగా ఇప్పటికే చెప్పామని అన్నారు. శుక్రవారం ఇక్కడ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జి సునీల్‌ దేవ్‌ధర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. అమరావతి రైతుల ఉద్యమాన్ని సమర్థిస్తున్నామని, రైతులకు ఇవ్వవలసినవి, గత ప్రభుత్వం ఇస్తామన్నవి, ఈ ప్రభుత్వం అమలు చేయాలన్నారు.

చంద్రబాబువి మూర్ఖపు నిర్ణయాలు: జీవీఎల్‌ 
► టీడీపీ చేసిన తప్పులకు ఆ పార్టీ బాధ్యత వహించకుండా బీజేపీని టార్గెట్‌ చేసి తప్పించుకోవచ్చని తప్పుడు ఆలోచనలు చేస్తోంది.
► గత టీడీపీ ప్రభుత్వం స్వార్థ రాజకీయాల కోసం అమరావతిని ఎంచుకుంది.
► భూములిచ్చిన రైతులకు న్యాయం జరగాలని, ప్రభుత్వ పెట్టుబడులు వృథా కాకూడదని చెప్పాం.
► రాజధాని అమరావతి కొనసాగి ఉంటేనే బాగుండేది.
► చంద్రబాబు ముఖ్యమంత్రిగా అనేక మూర్ఖపు నిర్ణయాలు తీసుకున్నారు. సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వబోమన్నారు.  కేంద్ర అధికారులను కూడా తామే ఎంక్వైరీ చేస్తామని మూర్ఖంగా ప్రవర్తించారు. ఆయన ఉంటే చంద్రన్న రాజ్యాంగం. లేకపోతే అసలు రాజ్యాంగం తనకు అనుకూలంగా పని చేయాలనుకోవడం తప్పు.
► అప్పుడూ కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది. చంద్రబాబు చేసిన నిర్ణయం తప్పు అయినా, మేం జోక్యం చేసుకోలేదు. కాబట్టి ప్రస్తుత నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు.
► రాయలసీమలో హైకోర్టు పెట్టాలని మా మేనిఫెస్టోలో డిమాండ్‌ చేశాం.

జేపీ నడ్డాతో సోము వీర్రాజు భేటీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో శుక్రవారం భేటీ అయ్యారు. పార్టీ ఏపీ ఇన్‌చార్జి  సునీల్‌ దేవ్‌ధర్‌తో కలిసి నడ్డాతో భేటీ అయిన వీర్రాజు తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.  ఉపరాష్ట్రపతి వెంకయ్యను వీర్రాజు మర్యాద పూర్వకంగా కలిశారు.  హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్, పార్జీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రాంమాధవ్, అరుణ్‌సింగ్‌ తదితరులను వీర్రాజు కలిశారు.

మరిన్ని వార్తలు