‘అమరావతి’కి ప్రధాని పుణ్యజలాలు తెస్తే విమర్శించారు

15 Dec, 2020 05:00 IST|Sakshi

తుళ్లూరులో రాజధాని రైతుల సమ్మేళనంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు 

సాక్షి, అమరావతి/తాడికొండ: అప్పట్లో రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ ఆ కార్యక్రమం కోసం ప్రసిద్ధ పుణ్యనదుల నుంచి నీరు తెస్తే.. ఆయన వెళ్లిన అరగంటకే తీవ్ర విమర్శలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. అప్పటి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌.. ప్రధాని మోదీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతోపాటు మోదీ ఏపీకి రావద్దని నల్ల బ్యానర్లు కట్టారన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని తమ పార్టీ కోరుకుంటున్నట్లు తెలిపారు.

భారతీయ కిసాన్‌సంఘ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్నా రాంబాబు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తుళ్లూరులో సోమవారం నిర్వహించిన రాజధాని ప్రాంత చిన్న సన్నకారు రైతుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి కోసం ఆందోళన చేస్తున్నవారిని అభినందించారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు 64 వేల పట్టాలివ్వాలని, మిగిలిన 9 వేల ఎకరాలు భూమిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నట్టు తెలిపారు. అవరావతి అభివృద్ధి జరగాలంటే 2024లో బీజేపీని గెలిపించాలని కోరారు. దీంతో సభలో కూర్చున్న టీడీపీ సానుభూతిపరులు, మహిళలు చల్లగా జారుకోవడం కనిపించింది.  

మరిన్ని వార్తలు