అచ్చెన్న ఎత్తులు చిత్తు, రెండు చోట్లా పరాభవం

16 Mar, 2021 10:00 IST|Sakshi

పురపోరులో దారుణ పరాభవం

ఎన్ని ఎత్తులు వేసినా కరుణించని జనం

రెండు మున్సిపాలిటీల్లోనూ బెడిసికొట్టిన వ్యూహం

సాక్షి, శ్రీకాకుళం: పలాస–కాశీబుగ్గ, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఒక ఎంపీ, మరో ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లాలోని మిగతా మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ ప్రతినిధులు దృష్టి సారించారు. ఎన్నికల ఆద్యంతం అక్కడే తిష్ట వేశారు. ఫోన్‌లో బెదిరింపులకు దిగారు. నేరుగా బేరసారాలు సాగించారు. అక్కడితో ఆగకుండా పెద్ద ఎత్తున డబ్బును సమకూర్చి దగ్గరుండి పంపిణీ చేయించారు. ఎలాగైన గెలవాలని విశ్వప్రయత్నాలు చేశారు. కానీ ప్రజలు వాటిన్నింటినీ తిప్పికొట్టారు. జిల్లాలో పలాస, ఇచ్ఛాపురం, పాలకొండలో ఎన్నికలను టీడీపీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వీటిపైనే ఎక్కువ దృష్టిసారించారు. పోలింగ్‌ వరకు తమ శక్తియుక్తులన్నీ ప్రదర్శించారు.

అచ్చెన్నతో పాటు ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర్‌ శివాజీ, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌతు శిరీష, మిగతా మాజీ ఎమ్మెల్యేలంతా టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం అడ్డదారులు తొక్కారు. కానీ జనం మాత్రం వైఎస్సార్‌ సీపీ వైపే నిలబడ్డారు. నిజంగా ఇది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి ఘోర పరాభవమే. ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌కు కూడా చావు దెబ్బ వంటిదే.

పంచాయతీ ఎన్నికల్లోనూ కళా వెంకటరావు వంటి వారు ఎంత ప్రయత్నించినా గెలవలేకపోయారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముందు కుట్రలు, కుతంత్రాలు నడవవని ఈ ఎన్నికలు రుజువు చేశాయని వైఎస్సార్‌సీపీ నేతలు భావిస్తున్నారు. పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు, పాలకొండలో విశ్వాసరాయి కళావతి, పాలవలస విక్రాంత్, ఇచ్ఛాపురంలో పిరియా సాయిరాజ్, నర్తు రామారావు తదితర నేతలే బాధ్యత తీసుకుని గెలిపించారు. 

చదవండి:
గూగుల్‌ పే ఉందా.. అయితే డబ్బులు పంపండి
చిన్నారి ఉసురు తీసింది.. కుక్కలు, కోతులా? హత్యా?

మరిన్ని వార్తలు