Annamalai Strategy To Strengthen BJP: పదవుల పందేరం? 

23 Aug, 2021 14:37 IST|Sakshi

కొత్త వారికి అవకాశాలపై అన్నామలై కసరత్తు 

సాక్షి, చెన్నై: రాష్ట్ర బీజేపీలో సంస్థాగత మార్పులకు రంగం సిద్ధమైంది. ఇందుకు తగ్గ కసరత్తుల్లో కొత్త అధ్యక్షుడు అన్నామలై నిమగ్నమై ఉన్నారు. 50 శాతం మేరకు పదవుల్లో మార్పులు తథ్యం అని కమలాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. ఎవ్వరూ ఊహించని రీతిలో రాష్ట్ర బీజేపీలో పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా అధ్యక్షుడి పగ్గాలు చేపట్టిన ఎల్‌. మురుగన్‌ అనూహ్యంగా కేంద్ర సహాయ మంత్రి అయ్యారు. ఆయన స్థానంలో పార్టీలో చేరిన నెలల వ్యవధిలో కొత్త అధ్యక్షుడిగా మాజీ ఐపీఎస్‌ అధికారి అన్నామలై నియమితులయ్యారు.  

ఈ మేరకు తనదైన శైలిలో పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు. పార్టీలో అధ్యక్షుడి తర్వాత ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, కోశాధికారి పదవులు కీలకంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా, స్థానిక ఎన్నికల కసరత్తుల్లో భాగంగా సోమవారం మరోమారు తొమ్మిది జిల్లాల నాయకులతో సమావేశానికి అన్నామలై నిర్ణయించారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో 4 చోట్ల బీజేపీ గెలిచిన విషయం తెలిసిందే. ఆ మేరకు గెలిచిన నియోజకవర్గాలైన తిరునల్వేలి, కన్యాకుమారి, కోయంబత్తూరు, ఈరోడ్‌ జిల్లాలకు పార్టీ తరపున ఇన్నోవా కార్లను ఆదివారం పంపిణీ చేయడం విశేషం. పార్టీ అభ్యర్థుల కోసం శ్రమించిన ఈ జిల్లాలకు చెందిన కొందరు నేతలకు రాష్ట్ర కార్యవర్గంలో పదవులు దక్కబోతున్నట్లు తెలుస్తోంది. 

చదవండి: డీఎంకే నాయకుడి హత్య

మరిన్ని వార్తలు