‘సాహో చంద్రబాబు’పై చర్యలు తీసుకోండి

17 Apr, 2021 04:07 IST|Sakshi
ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌కు ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు అంకంరెడ్డి నారాయణరెడ్డి, శ్రీనివాసులు

చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల ప్రధాన అధికారి, ఏడీజీలకు వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు   

సాక్షి, అమరావతి/ సత్యవేడు: సాహో చంద్రబాబు పేరుతో సోషల్‌ మీడియా వేదికగా తిరుపతి ఉప ఎన్నికలపై టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ నేతలు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంకంరెడ్డి నారాయణరెడ్డి, లీగల్‌సెల్‌కు చెందిన శ్రీనివాసులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విజయానంద్, శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌లకు, చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడు ఎస్‌ఐ నాగార్జునరెడ్డికి ఫిర్యాదు అందజేశారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ స్వీయ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న సోషల్‌ మీడియా (ఫేస్‌ బుక్‌) వేదికగా సాహో చంద్రబాబు పేరుతో చేస్తున్న తప్పుడు ప్రచారానికి సంబంధించిన ఆధారాలను అందజేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులైన పెద్దిరెడ్డి, వేమిరెడ్డి కృష్ణపట్నం నుంచి సత్యవేడు వరకు సెజ్‌ కోసం భూములు లాక్కుంటారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని నష్టపరిచే విధంగా ఓటర్లను ప్రభావితం చేయడానికి అసత్య ప్రచారం చేస్తున్న సోషల్‌ మీడియా అకౌంట్లపై, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వాటిని నిర్వహిస్తున్న చంద్రబాబు, లోకేశ్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ పరువుకు భంగం కలిగించడమేగాక తమ మనోభావాలు దెబ్బతినేలా తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబు, లోకేశ్‌లపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే ఆదిమూలం కోరారు. 

మరిన్ని వార్తలు