చేరికలపై హస్తం ఫోకస్‌..!

26 Dec, 2023 00:46 IST|Sakshi

లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లలో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్‌ కసరత్తు 

టికెట్ల హామీతో బీజేపీలోని కీలక నేతలను చేర్చుకునే యోచన 

గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన బీసీ నేతలకు ఆహ్వ నం 

ఇప్పటికే పలువురితో మంతనాలు..  

కరీంనగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్‌ జిల్లాలపై దృష్టి 

15 ఎంపీ స్థానాలు దక్కించుకోవాలన్న ధ్యేయంతో వ్యూహాలు 

సాక్షి, హైదరాబాద్‌:  లోక్‌సభ ఎన్నికల్లో రా­ష్ట్రం­లో ఎక్కువ సీట్లు దక్కించుకునే లక్ష్యంతో కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వచ్చి, అధికారం చేపట్టిన నేపథ్యంలో.. పార్టీని మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని భావిస్తోంది.

ఈ క్రమంలో గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి వెళ్లిన నేతలను, బీజేపీలోని కీలక నేతలను చేర్చుకోవాలని యోచిస్తోంది. ఏఐసీసీ పర్యవేక్షణలో ఇప్పటికే పలువురు బీజేపీ ముఖ్య నాయకులతో కాంగ్రెస్‌ నేతలు చర్చలు కూడా జరిపినట్టు గాందీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్‌ జిల్లాల నేతలపై ఫోకస్‌ పెట్టినట్టు సమాచారం. మొత్తమ్మీద 15 ఎంపీ స్థానాలు గెలుపొందడమే లక్ష్యంగా ముందుకెళ్లాలన్నది కాంగ్రెస్‌ ఆలోచనగా కనిపిస్తోంది. 

జాతీయ స్థాయిలో ప్రయోజనం కోసం.. 
ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను పదింట బీజేపీతోనే పోటీ ఉంటుందని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ శివారు స్థానాలు, ఉత్తర తెలంగాణలోని లోక్‌సభ సీట్లలో కమలనాథుల నుంచి గట్టిపోటీ ఉంటుందని భావిస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన లోక్‌సభ అభ్యర్థుల స్థాయి నేతలను చేర్చుకోవడం ద్వారా.. ఆదిలోనే బీజేపీకి చెక్‌ పెట్టవచ్చనే ఆలోచనతో కాంగ్రెస్‌ ఉన్నట్టు చర్చ జరుగుతోంది. 

ఇప్పటికే మంతనాలు షురూ.. 
కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ బీజేపీ కీలక నేతను చేర్చుకునే విషయంలో టీపీసీసీ నేతలు ఇప్పటికే చర్చలు జరిపినట్టు తెలిసింది. ఆయనకు కరీంనగర్‌ లోక్‌సభ స్థానాన్ని ఆఫర్‌ చేయడంతోపాటు ప్రభుత్వంలో మంచి ప్రాధాన్యత కలి్పస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన మాజీ ఎంపీలతోపాటు మెదక్‌ జిల్లాకు చెందిన ఓ కీలక నేతతోనూ టచ్‌లోకి వెళ్లినట్టు తెలిసింది.

మరో ఐదేళ్లదాకా తెలంగాణలో బీజేపీ ని­ల­దొక్కుకోవడం కష్టమని.. లోక్‌సభ ఎ­న్నికల్లో కాంగ్రెస్‌కు అండగా నిలిస్తే, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను పక్కాగా నిలువరించవచ్చ­ని సదరు నేతలకు స్పష్టం చేసినట్టు సమాచారం. ఇక హైదరాబాద్‌ శివారు నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు బీసీ నేతలు గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి ఉన్న నేపథ్యంలో.. వారిని కూడా పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరమైనట్టు తెలిసింది. మొత్తమ్మీద లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రావడానికి ముందే బీజేపీ కీలక నేతలను చేర్చుకోవడం ద్వారా.. పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగవచ్చని భావిస్తున్నట్టు సమాచారం.

>
మరిన్ని వార్తలు