Amit Shah J&K Tour: అలా చేస్తే రక్తపాతం జరుగుతుందన్నారు.. కానీ ఇప్పుడు చూడండి ఎలా ఉందో..

4 Oct, 2022 14:09 IST|Sakshi

జమ్ముకశ్మీర్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా రాజౌరిలో భారీ ర్యాలీకి హాజరయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆయన ప్రసంగించే సమయంలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు 'మోదీ-మోదీ' నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. దీంతో కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తే రక్తపాతం జరగుతుందని భయపెట్టిన వారికి ఈ నినాదాలే సమాధానం అని అమిత్ షా అన్నారు. మోదీ నాయకత్వంలో కశ్మీర్‌ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు.

కశ్మీర్‌ను 70 ఏళ్ల పాటు మూడు కుటుంబాలే పాలించాయని అమిత్షా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని వాళ్ల కుటుంబాలకే పరిమితం చేశారని విమర్శించారు. బీజేపీ అధికారంలో వచ్చాక కశ్మీర్‌లో విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పెంచామని, మెడికల్ కాలేజీలు మంజూరు చేశామని, 100కుపైగా పాఠశాలలు కొత్తగా వచ్చాయని, కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు అవుతున్నాయని, హైవేల కోసం రూ.లక్ష కోట్లు మంజూరు చేశామని షా తెలిపారు.  2019, ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాతే ఇవన్నీ జరిగాయని చెప్పారు.

అమిత్ షా కశ్మీర్ పర్యటనలో పలు కీలక ప్రకటనలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పహరీ వర్గాన్ని ఎస్టీల జాబితాలో చేర్చే విషయంపై అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం. మూడు రోజుల పర్యటనలో దీనిపై స్పష్టత రానుంది.
చదవండి: చీతాలకు లంపీ డిసీజ్‌కు ముడిపెట్టిన నానా పటోలే.. ఏకిపారేసిన బీజేపీ

మరిన్ని వార్తలు