సీఎం పదవికి రాజీనామా: నాలుగో వ్యక్తి రూపానీ.. ముందు ముగ్గురు ఎవరంటే

11 Sep, 2021 19:07 IST|Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న గుజరాత్‌లో బీజేపీ కీలక మార్పులకు తెర తీసింది. దానిలో భాగంగా ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ శనివారం తన పదవికీ రాజీనామా చేశారు. పటేల్‌ సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగానే బీజేపీ అధిష్టానం విజయ్‌ రూపానీతో రాజీనామా చేయించిందనే వార్తలు వెలువడుతున్నాయి. తదుపరి సీఎం రేసులో ఉన్న వారి పేర్లు చూస్తే ఈ వార్తలు వాస్తవమే అనిపిస్తున్నాయి. గుజరాత్‌ కొత్త సీఎం రేసులో ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌, ఎంపీ సీఆర్‌ పటేల్‌, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవియా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గుజరాత్‌ నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించబోయేది ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.

అయితే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పలు రాష్ట్రాల్లో ఇలా ముఖ్యమంత్రులతో రాజీనామా చేయించడం బీజేపీకి పరిపాటిగా మారింది. ఇలా అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం పదవికి రాజీనామా చేసిన వారిలో గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ నాల్గవ వ్యక్తి. గతంలో కర్ణాటక, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రుల చేత బీజేపీ అధిష్టానం ఇలానే రాజీనామా చేయింది. 

రాజీనామాలు చేయించడం ఎందుకు..
వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా ప్రాంతాల్లో విజయం కోసం బీజేపీ వేర్వేరు వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుత సీఎం పనితీరు, వారిపై ఉన్న వ్యతిరేకత-వివాదాలు, ఆయా రాష్ట్రాల్లో పార్టీకి మేజర్‌ ఓటు బ్యాంకు ఇలా తదితర అంశాల ఆధారంగా బీజేపీ పావులు కదుపుతోంది. తాజాగా కర్ణాటక​, గుజరాత్‌లో పరిశీలించినట్లయితే.. ఈ రెండు రాష్ట్రాల్లో పార్టీ మెజారిటీ ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగానే సీఎంల చేత రాజీనామా చేయించింది.

ఈ క్రమంలో యడ్డీ రాజీనామా తర్వాత కర్ణాటకలో తనకు గట్టి మద్దతుదారులైన లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన బసవరాజు బొమ్మైనే ముఖ్యమంత్రిగా నియమించింది. ఇక గుజరాత్‌లో కూడా పటేల్‌ సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగా నూతన ముఖ్యమంత్రిగా ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే అవకాశం ఇవ్వనున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. 

ఇక బీజేపీ ముఖ్యమంత్రులతో రాజీనామా చేయించిన మిగతా రాష్ట్రాలు ఏవి అంటే.. 

1. జూలై 2021: కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేసిన యడ్డీ
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తర్వత.. ఈ ఏడాది జూలై 26 న, బీఎస్‌ యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. యడ్డీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన, అతడి కుమారుడిపై పెద్ద ఎత్తున ప్రజాగ్రాహం వెల్లడయ్యింది. అంతేకాక పార్టీ రాష్ట్ర విభాగంలోని ఒక నిర్దిష్ట విభాగం యడ్డీని పదవి నుంచి తొలగించాలని బీజేపీ అధిష్టాన్నాన్ని డిమాండ్‌ చేసింది.

యడియూరప్పపై పెరుగుతున్న ఆగ్రహం.. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ యడ్డీ చేత రాజీనామా చేయించింది. 75 సంవత్సరాల పదవీ విరమణ వయస్సు పరిమితి కారణంగానే 78 ఏళ్ల యడ్డీ చేత రాజీనమా చేయించినట్లు బీజేపీ తెలిపింది. ఆయన స్థానంలో బీజేపీ తోటి లింగాయత్‌ అయిన 61 ఏళ్ళ బసవరాజు బొమ్మైని ముఖ్యమంత్రిగా నియమించింది. బొమ్మై గతంలో యడ్డీ మంత్రివర్గంలో హోంమినిస్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
(చదవండి: బీజేపీకి షాకివ్వనున్న యడియూరప్ప? బల నిరూపణకు సై)

2. జూలై 2021: ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్ రాజీనామా
మార్చి 2021 లో త్రివేంద్ర సింగ్ రావత్ తన రాజీనామాను సమర్పించిన తర్వాత తీరథ్‌ సింగ్‌ రావత్‌ ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే తీరథ్‌ సింగ్ ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడం చేత ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మార్చిలో పదవి చేపట్టినప్పటి నుంచి అమ్మాయిల చిరిగిన జీన్స్‌పైన, ఆధ్యాత్మికతతో కరోనాపై పోరాటం లాంటి తీరథ్‌ వ్యాఖ్యలు పలు వివాదాలు రేపాయి. కరోనా రెండో ఉద్ధృతి వేళ కుంభమేళా నిర్వహణ తెచ్చిన చెడ్డపేరు, పార్టీలోనూ – పాలనలోనూ గందరగోళం... ఇలా అన్నీ కలిసి ఆయనకు పదవీగండం తెచ్చాయి. ఫలితంగా తీరథ్‌ ఈ ఏడాది జూలై 2021న తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో పుష్కర్‌ సింగ్‌ ధామీ ఉత్తరాఖండ్‌ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 
(చదవండి: ఐదు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా..)

3. మార్చి 2021: ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్
త్రివేంద్ర సింగ్ రావత్ మార్చి 9 వ తేదీన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 2017, మార్చి 18న రావత్‌ ఉత్తరాఖండ్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకుగాను 57 సీట్లను బీజేపీ గెలుచుకుంది. అయితే పార్టీలోని చాలా మంది నాయకులు రావత్ ముఖ్యమంత్రి పదవిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రావత్‌ తమ మాట  వినలేదని ఫిర్యాదు చేశారు.

రావత్ పని తీరును కూడా వారు వ్యతిరేకించారు. ఈ క్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి అధిష్టానం వద్ద తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దాంతో రావత్‌ను పార్టీ హైకమాండ్ ఢిల్లీకి పిలిచింది. ఈ మీటింగ్‌ అనంతరం రావత్‌ తన రాజీనామాను గవర్నర్‌ బేబీ రాణి మౌర్యకు రాజ్‌భవన్‌లో సమర్పించారు. ఆయన స్థానంలో తీరత్‌ సింగ్‌ తెరపైకి వచ్చారు. ఆయన కూడా నాలుగు నెలల్లో రాజీనామా చేయడం గమనార్హం. తాజాగా విజయ్‌ రూపానీ రాజీనామా చేసిన నాల్గవ సీఎంగా నిలిచారు. 

చదవండి: అనివార్యతే వేటుకి కారణమైందా?

మరిన్ని వార్తలు