ఆసీస్‌ బెదిరింపులకు తలొగ్గిన తాలిబన్లు.. మహిళల క్రికెట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌..?

11 Sep, 2021 19:07 IST|Sakshi

కాబుల్: అఫ్గాన్‌ మహిళలు క్రికెట్ ఆడేందుకు తాలిబన్లు విముఖత చూపితే పురుషుల జట్టుతో నవంబర్​లో జరగాల్సిన టెస్టు మ్యాచ్ రద్దు చేస్తామని క్రికెట్‌ ఆస్ట్రేలియా వార్నింగ్‌ ఇచ్చిన నేపథ్యంలో అఫ్గాన్‌ క్రికెట్ బోర్డు స్పందించింది. అఫ్గాన్‌ మహిళలు క్రికెట్​ ఆడేందుకు ఇప్పటికీ అవకాశం ఉందని ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ అజీజుల్లా ఫజ్లీ వెల్లడించారు. ఈ ప్రక్రియ ఎలా జరగుతుందనేది త్వరలోనే తెలియజేస్తామని, అఫ్గానీ మహిళలు కచ్చితంగా శుభవార్తను వింటారని ఆయన తెలిపారు. అఫ్గాన్ మహిళలు క్రికెట్‌ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనరని, అఫ్గానీ మహిళలకు క్రీడా కార్యకలాపాలు అవసరం లేదని తాలిబన్ సాంస్కృతిక కమిషన్ డిప్యూటీ హెడ్ అహ్మదుల్లా వాసిక్  ప్రకటించిన కొద్దిరోజులకే ఫజ్లీ ఈ మేరకు వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
చదవండి: అదే జరిగితే చారిత్రక సిరీస్‌ రద్దు.. తాలిబన్లకు క్రికెట్‌ ఆస్ట్రేలియా వార్నింగ్‌

ఇదిలా ఉంటే, మహిళల క్రికెట్‌ను రద్దు చేయరాదంటూ క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) గత గురువారం తాలిబన్‌ ప్రభుత్వాన్ని కోరింది. తాలిబన్లు మహిళల క్రికెట్‌ను నిర్వీర్యం చేయాలనుకుంటే.. తమ జట్టుతో నవంబర్‌ 27న జరగాల్సి ఉన్న చారిత్రక టెస్ట్‌ మ్యాచ్‌ను రద్దు చేసుకుంటామని బెదిరింపులకు దిగింది. ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్‌ అభివృద్ది చెందాలన్నదే తమ ఉద్దేశమని, మహిళల క్రికెట్‌కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొంది. ఈ విషయమై ఆసీస్‌ టెస్ట్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ కూడా ఘాటుగానే స్పందించాడు. 

తాలిబన్లు మహిళల క్రికెట్‌ను నిర్వీర్యం చేస్తే.. త్వరలో జరుగబోయే పురుషుల టీ20 ప్రపంచకప్​ నుంచి ఆ దేశాన్ని తప్పించాలని ఐసీసీని డిమాండ్‌ చేశాడు. అయితే తాలిబన్ల ప్రకటన ఆధారంగా పురుషుల జట్టును శిక్షించవద్దని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఐసీసీని వేడ్కొంది. కాగా, అఫ్గానిస్తాన్‌ తాలిబన్ల వశమైన నాటి నుంచి అక్కడ అరచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. కఠినమైన షరియా చట్టాల పేరుతో తాలిబన్లు మహిళల హక్కులను కాలరాస్తున్నారు.  ఈ క్రమంలోనే మహిళా క్రికెట్‌ను నిషేధించారు. 
చదవండి:  ఇకపై అక్కడ మహిళల 'ఆటలు' సాగవు..
 

మరిన్ని వార్తలు