కేసీఆర్‌ తరువాత టీఆర్‌ఎస్‌ బాస్‌ ఎవరు..?

8 Sep, 2020 16:37 IST|Sakshi

రాముడికి పట్టాభిషేకం.. హరీష్‌రావు ఎక్కడా..? 

వెబ్‌ స్పెషల్‌ : తెలంగాణ ఉద్యమ చరిత్రలో కల్వకుంట్ల కుటుంబానికి ప్రత్యేక స్థానముంది. ఆరు దశాబ్ధాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కే చంద్రశేఖర్‌రావు నిర్వహించిన మలిదశ పోరాటం ప్రజానీకం మరువలేనిది. కేవలం స్వరాష్ట్రమే ధ్వేయంగా 2001 ఏప్రిల్‌ 27న టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపన మొదలు.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వరకు బిగించిన పిడికిలి వదలకుండా పోరాటం చేసిన నేతగా, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా కేసీఆర్‌ కీర్తి గడించారు. వలస పాలకుల పెత్తనానికి చరమగీతం పాడుతూ ఉద్యమాన్ని ముందుండి నడిపించి, మూడుకోట్ల తెలంగాణ పౌరుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన గులాబీ బాస్‌గా ప్రజల గుండెల్లో చోటుదక్కించుకున్నారు. ఇక ఈ క్రమంలోనే 2014లో జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్‌.. ఆ తరువాత రాజకీయంగా తెలంగాణ గడ్డపై తనకు ఎదురేలేదని నిరూపించుకున్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగిన ప్రతిపక్షాలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కకుండా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ గులాబీ జెండాను రెపరెపలాడిస్తున్నారు. సంక్షేమ పథకాలే బలంగా రెండోసారి ఎన్నికల బరిలో నిలిచిన కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు నీరాజనాలు పలికారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా బంపర్‌ మెజార్టీ అందించారు. తెలంగాణలో తనకు ఎవరూ సాటిలేరని మరోసారి నిరూపించారు.

కేసీఆర్‌ తరువాత నాయకుడు ఎవరు..?
అయితే ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, 2024 ఎన్నికల నాటికి సీఎం బాధ్యతల నుంచి తప్పకుంటారని ఓ బలమైన వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ వారసుడు ఎవరు అనేది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమం మొదలైననాటి నుంచి ఆయన మేనళ్లుడు, ప్రస్తుత మంత్రి హరీష్‌తో పాటు కుమారుడు, మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారాకరామారావు కూడా ఆయన వెంట ఉన్నారు. అయితే కేటీఆర్‌ కంటే హరీష్‌ ఉద్యమం తొలినాళ్ల నుంచీ క్రియాశీలక రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉన్నారు. అయినప్పటికీ ‍ప్రస్తుతం పార్టీలోనైనా, ప్రభుత్వంలోనైనా హరీష్‌ కంటే కేటీఆర్‌దే పై చేయి అని రాజీకీయ విశ్లేషకుల మాట. హరీష్‌ ఎంత సీనియర్‌ అయిన్పటికీ కేసీఆర్‌ వారసుడిగా కేటీఆర్‌కే తొలి ప్రాధాన్యత ఉంటుందని, ఆయన తరువాత పార్టీతో పాటు ప్రభుత్వ పగ్గాలను సైతం కేటీఆర్‌యే అందుకుంటారని అభిప్రాయపడుతున్నారు.

తండ్రి విజయం వెనుక తారకరాముడు..
కేసీఆర్‌ వారసత్వాన్ని పునికిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్‌ అనతికాలంలోనే రాజకీయాలను వంటపట్టించుకున్నారు. పాలనలో, వ్యూహ రచనలోనైనా తనదైన శైలిని అలవరుచుకున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లితే రాష్ట్ర పార్టీ బాధ్యతల్ని ఎవరికి అప్పగిస్తారనే ప్రశ్న రాజకీయ వర్గల్లో ఉత్నన్నమవుతోంది.  కాగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగం అయ్యేందుకు అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి 2004 నుంచి కేటీఆర్‌ పరోక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లోకసభ స్థానం నుంచి గెలిచిన కేసీఆర్ తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం నిర్లక్ష్యం చూపడంతో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటేందుకు 2006లో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ 2లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. అయితే కేసీఆర్‌ విజయం వెనుక  ఆయన తనయుడు పాత్ర ఎంతో ఉంది. ఎన్నికల్లో చురుకైన పాత్ర పోషించి.. తెలంగాణ వాదాన్ని ముందుండి నడిపించారు.

2008లో మరోసారి కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలోకి దిగినప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేసి తనదైన ముద్ర వేసుకున్నారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీచేసి, తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 171 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టారు. సుమారు దశాబ్ధాల కాలం క్రితం ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితంలో ఓటమిని ఏనాడు రుచిచూడని నేతగా గుర్తింపుపొందారు. ఈ క్రమంలోనే  తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 68,219 ఓట్ల భారీ మెజార్టీతో రెండోసారి గెలుపొందారు.

శాసన సభ్యుడిగా, మంత్రిగా
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొండూరి రవీందర్‌రావుపై 53,004 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలిసారి ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2018 ముందస్తు ఎన్నికల్లో 89,009 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. 2018 డిసెంబరు 17న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టి పార్టీపై పూర్తి పట్టు సాధించారు.  ఈ క్రమంలోనే 2019 సెప్టెంబరు 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి... ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖలకు కొత్త రూపులను దిద్దుతున్నారు.

కేటీఆర్‌కు పట్టాభిషేకం.. హరీష్‌రావు ఎక్కడా..?
అయితే తొలినుంచి ఉద్యమంలోనూ, టీఆర్‌ఎస్‌లోనూ ముఖ్యపాత్ర పోషిస్తూ కేసీఆర్‌ విజయంలో సగభాగంగా ఉంటూ కీలకంగా వ్యవహరిస్తున్న హరీష్‌రావును కేసీఆర్‌ పక్కకుపెడుతున్నారనేది ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలు. కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు సైతం ఇలాంటి వ్యాఖ్యలను అనేక సందర్భాల్లో చేశారు. అంతేకాకుండా కేసీఆర్‌కు వ్యతిరేకంగా హరీష్‌ పావులు కదుపుతున్నారని, ఏదో ఒకరోజు బీజేపీ నేతలతో చేతులు కలుపుతారనీ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హరీష్‌రావును ఆహ్వానించకపోవడం అ‍ప్పట్లో రాజకీయ వర్గల్లో హాట్‌టాపిక్‌గా మారింది. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖామంత్రిగా విధులు నిర్వర్తించిన హారీష్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అహర్నిశలు శ్రమించారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్‌ తొలుత విడుదల చేసిన లిస్ట్‌లో టీఆర్‌ఎస్‌ స్టార్‌ క్యాంపెయిర్‌ జాబితాలో హరీష్‌రావు పేరు లేకపోవడం తీవ్ర దుమారం రేపింది.

హరీష్‌ను కేసీఆర్‌ కావాలనే పక్కనపెడుతున్నారనే అప్పట్లో వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఈ తరుణంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించి... పార్టీ పూర్తి పగ్గాలను కేటీఆర్‌కు అప్పగించారు కేసీఆర్‌. వనవాసం అనంతరం అయోధ్యలో రాముడి పట్టాభిషేకం జరిపిన రీతిలో కేటీఆర్‌ పట్టాభిషేకం జరిపించారు. దీంతో కేసీఆర్‌ అనంతరం టీఆర్‌ఎస్‌ బాస్‌ ఎవరూ అనేదానికి సీఎం స్పష్టమైన సంకేతాలు ఇవ్వకనే ఇచ్చారనేది అర్థమవుతోంది. మరోవైపు 2024 ఎన్నికల నాటికి కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని ఆ సమయానికి సీఎం బాధ్యతల్లో మార్పులు చేస్తారని రాజకీయ వర్గల్లో చర్చసాగుతోంది. అయితే కేటీఆర్‌కు సీఎం బాధ్యతలు అప్పగిస్తే హరీష్‌ పరిస్థితి ఏంటీ..? ఆయన వర్గం మద్దతు తెలుపుతుందా..? కేటీఆర్‌కు ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపుతారు అనేది రాజకీయ వర్గల్లో వస్తున్న ప్రశ్నలు. వీటన్నింటికీ కేసీఆర్‌యే భవిష్యత్‌లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటి వరకు వేచిచూద్దాం.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా