టీడీపీ శవ రాజకీయం.. ఎల్లో మీడియా కొత్త కలరింగ్‌!

12 Sep, 2023 08:03 IST|Sakshi
చిత్తూరు జిల్లా కొడతనపల్లె చెందిన మృతుడు వెంకటేష్‌ బంధువులకు ఆర్థిక సాయం అందిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

అనారోగ్యం బారినపడి రాష్ట్రవ్యాప్తంగా పలువురి మృతి

చంద్రబాబు అరెస్ట్‌ను తట్టుకోలేక అభిమానులు మరణిస్తున్నారంటూ కలరింగ్‌

ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్న టీడీపీ నేతలు

శ్రీకాళహస్తి/పెద్దపంజాణి/గుడుపల్లె/తాడేపల్లిగూడెం రూరల్‌: అనారోగ్యం బారిన పడి మృతి చెందిన వ్యక్తుల శవాలనూ టీడీపీ నేతలు వదలడం లేదు. నిత్యం అనారోగ్య కారణాలతో రాష్ట్రంలో మరణాలు సంభవిస్తూ ఉంటాయి. రెండు రోజులుగా అలాంటి మరణాలను చంద్రబాబు అరెస్ట్‌ను తట్టుకోలేక వ్యక్తులు ప్రాణాలు విడుస్తున్నట్టుగా టీడీపీ నేతలతోపాటు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. తద్వారా చంద్రబాబు అరెస్ట్‌పై సానుభూతి సంపాదించేందుకు టీడీపీ నేతలు తెగతాపత్రయ పడుతున్నారు. అయితే, వాస్తవాలు తెలిసిన ఆయా ప్రాంతాల వారు టీడీపీ ప్రచార యావను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. పలుచోట్ల నమోదైన మరణాలు టీడీపీ ఖాతాలోకి చేరిపోయాయి.

వాటిలో కొన్ని ఇలా..
గుండెపోటుతో మరణించాడంటూ..
తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం తంగేళ్లపాలెం దళితవాడకు చెందిన వెంకట రమణయ్య(45) ఈ నెల 9న మధ్యాహ్నం రుయాలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అయితే చంద్రబాబు అరెస్ట్‌ వార్త విని గుండెపోటుతో మరణించాడంటూ తెలుగుదేశం నాయకులు, పచ్చమీడియా శవ రాజకీయం మొదలుపెట్టాయి. నిజానికి వెంకట రమణయ్యకు బీపీ, షుగర్‌ వంటి ఆనారోగ్య సమస్యలున్నాయి. 9న ఉదయాన్నే ఆయన పొలానికి వెళ్లి కళ్లు తిరిగి పడిపోవడంతో స్థానికంగా ఉన్న ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతను బీపీ మాత్రలు సక్రమంగా వేసుకోకపోవంతో బీపీ ఎక్కువై మెదడులో నరాలు దెబ్బతినడంతో కోమాలోకి వెళ్లాడని వైద్యులు తెలిపారు. దీంతో అక్కడినుంచి తిరుపతిలోని మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతిచెందాడు. దీనిని చంద్రబాబు అరెస్ట్‌ వార్త విని గుండెపోటుతో మరణించాడంటూ ఎల్లో మీడియాలో ప్రచారం చేయడమేంటని బంధువులు, తంగేళ్లపాలెం గ్రామస్తులు ప్రశ్నించారు.

మరో ఘటనలోనూ..
చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం కొడతనపల్లెకు చెందిన వెంకటేష్‌కు ఈ నెల 9న ఉదయం గుండెపోటు రావడంతో కుప్పంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఇంటికి తీసుకొచ్చారు. మరుసటిరోజు ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో గుండెనొప్పి ఎక్కువ కావడంతో ఇంట్లోనే మృతి చెందాడు. ఈ విషయం తెలిసి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు ఎమ్మెల్సీ భరత్‌కు సమాచారం అందించారు. వెంటనే దహన సంస్కారాల కోసం రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందించారు. ఆ తరువాత టీడీపీ నాయకులు అక్కడికి వెళ్లి చంద్రబాబును అరెస్ట్‌ చేíయడాన్ని టీవీలో చూసి గుండెపోటుతో మరణించాడంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశారు.

కత్తార్లపల్లిలోనూ ఇదే తీరు
చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం కత్తార్లపల్లికి చెందిన శంకరప్ప(50) ఆదివారం సాయంత్రం బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై ఇంటికొచ్చాడు. అరుగుపై విశ్రాంతి తీసుకుంటుండగా.. ఉండగా ఉన్నట్టుండి కుప్పకూలాడు. వెంటనే అతన్ని పుంగనూరు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు గుర్తించారు. దీనిపై స్థానిక టీడీపీ నాయకులు శంకరప్ప టీడీపీ కార్యకర్త అని, చంద్రబాబును అరెస్ట్‌ చేసి రాజమండ్రి జైలుకు పంపడంతోనే గుండెపోటుతో మృతిచెందాడని ప్రచారం చేశారు. దీనిని గమనించిన గ్రామస్తులు ఇదేం శవరాజకీయాలు నాయనా అంటూ నోరెళ్లబెట్టారు.

20 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తినీ..
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లికి చెందిన చిరు వ్యాపారి తాడేపల్లి శేఖర్‌(40) అనే వికలాంగుడు 20 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రెండు, మూడు రోజులకు ఒకసారి తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి వెళ్తూ చికిత్స తీసుకుంటున్నాడు. ఆదివారం అర్ధరాత్రి గుండెల్లో మంటగా ఉండటంతో ఆర్‌ఎంపీ వైద్యుడితో ఇంజెక్షన్‌ చేయించారు. మెరుగైన వైద్యం కోసం సోమవారం తెల్లవారుజామున అంబులెన్స్‌లో తణుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో శేఖర్‌ మృతి చెందాడు. కానీ.. ఇతడి మరణాన్ని చంద్రబాబు జైలుకు వెళ్లడాన్ని తట్టుకోలేక మృతి చెందాడంటూ ఎల్లో మీడియా ప్రచారం చేసింది.

ఇది కూడా చదవండి: చంద్రబాబుకు జైలు భోజనమే పెట్టాలి

మరిన్ని వార్తలు