‘అయ్యా భోజనం తిని వెళ్లయ్యా’

28 May, 2023 10:50 IST|Sakshi

పామూరు: ‘అయ్యా భోజనం తిని వెళ్లయ్యా’ అని కోరిన తల్లి మాటలే చివరివయ్యాయి. మళ్లీ వస్తానంటూ వెళ్లిన విద్యార్థి శాశ్వతంగా కన్ను మూశాడు. ఈత కోసం వెళ్లిన బీటెక్‌ విద్యార్థి క్వారీ నీటిలో పడి మృతి చెందిన ఘటన శనివారం కోడిగుంపల సమీపంలోని ఓ క్వారీలో చోటుచేసుకుంది. వేమూరి మదన్‌ (20)విజయవాడ లయోలా ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం స్వగ్రామం కోడిగుంపల వచ్చాడు. శనివారం స్నేహితులతో కలిసి ఈత నేర్చుకునేందుకు క్వారీలోకి దిగాడు. నీటిలోకి జారిపోతుండగా స్నేహితులు అతనిని రక్షించేందుకు యత్నించి విఫలమయ్యారు.

వెంటనే గ్రామంలోకి వెళ్లి చెప్పి గ్రామస్తులను క్వారీ వద్దకు తీసుకువచ్చి మదన్‌ను బయటకు తీయగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని కోడిగుంపల గ్రామం తరలించారు. తల్లి వేమూరి కళావతి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. అన్నంతినమని తల్లి కోరగా.. ఈతకు పోతున్నానని కాసేపట్లో వచ్చి తింటానని చెప్పి వెళ్లాడు. కానీ కుమారుడికి భోజనంపెట్టి తాను తినేందుకు ఎదురు చూస్తున్న కళావతి.. ఒక్కసారిగా మరణవార్త విని కుప్పకూలిపోయింది.

గ్రామంలో విషాదఛాయలు
వేమూరి అయ్యన్న, కళావతిల ఏకై క కుమారుడు మదన్‌ మరణంతో కోడిగుంపల గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కష్టపడి వ్యవసాయం, బట్టల వ్యాపారం చేసుకుని జీవిస్తూ కుమారుడిని చదివిస్తున్న వారు గ్రామంలో అందరికి తలలో నాలుకలా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వేసవి సెలవులకు వచ్చి, అప్పటిదాకా అందరితో కలిసి ఉండి అంతలో ఈత సరదాతో మృత్యువాత పడటంతో స్నేహితులు జీర్ణించుకోలేక పోతున్నారు. కాగా తరచూ ప్రమాదలు జరుగుతున్నా క్వారీల యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం బాధాకరం.

మరిన్ని వార్తలు