పార్వతీపురం టౌన్‌:..... | Sakshi
Sakshi News home page

పార్వతీపురం టౌన్‌:.....

Published Sun, May 28 2023 12:42 AM

ఇప్పలపోలమ్మ   - Sakshi

పార్వతీపురం టౌన్‌: పార్వతీపురంలో ఇప్పలపోలమ్మ, ఎర్రకంచమ్మ, బంగారమ్మ గ్రామదేవతల జాతర మహోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం వరకు నాలుగు రోజుల పాటు జాతర అంగరంగ వైభవంగా నిర్వ హించనున్నారు. జాతర మొదటి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రెండవ రోజు సోమవారం తొలేళ్ల ఉత్సవం, మంగళవారం అమ్మవార్ల సిరిమానోత్సవం భారీ ఊరేగింపుతో ఘటాలను స్థానిక అమ్మవార్ల ఆలయాలకు తరలిస్తారు. బుధవారం ఘటాల అనుపోత్సవం నిర్వహిస్తారు. ఉత్సవాల నాలుగు రోజులు అట్టహాసంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. సాంప్రదాయ నృత్యాలు, డ్యాన్స్‌లు, కోలాటాలు, నృత్యాలు ఏర్పాటు చేశారు.

విద్యుత్‌ వెలుగులు

జాతర సందర్భంగా పార్వతీపురం ఉత్సవ శోభ సంతరించుకుంది. పట్టణ ప్రధాన రహదారి సారికి వీధి నుంచి పాత బస్టాండ్‌ వరకు విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. వైకేఎం కాలనీ, బంగారమ్మ కాలనీలో విద్యుత్‌ అలంకరణ అందరినీ ఆకట్టుకున్నాయి. ఉత్సవాలకు వచ్చే భక్తులకు తాగునీటి సమస్య తలెత్తకుండా పట్టణంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అవసరమైన సహకారం అందిస్తున్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు డ్రోన్‌ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

సమన్వయంతో పని చేయాలి

ఇప్పల పోలమ్మ అమ్మవారి పండుగ, ఎర్ర కంచెమ్మ పండుగలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని రెవెన్యూ డివిజినల్‌ అధికారి కె.హేమలత అన్నారు. ఈ నెల 28 నుండి 30 వరకు నిర్వహించే ఇప్పల పోలమ్మ, ఎర్ర కంచెమ్మ, బంగారమ్మ గ్రామ దేవతల పండుగ సందర్భంగా ఈ నెల 18వ తేదీన నిర్వహించిన సమావేశంలో చర్చించిన మంచినీటి సరఫరా, బందోబస్తు, విద్యుత్‌, ఊరేగింపు, దర్శనాలకు చేయాల్సిన ఏర్పాట్ల అంశాలపై శాఖల వారీగా తీసుకున్న చర్యలను ఆర్‌డీఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో సమీక్షించారు. సమావేశంలో ఆర్‌డీఓ కె.హేమలత మాట్లాడుతూ ప్రజలు అధిక సంఖ్యలో హజరవుతున్నందున గత సమావేశంలో చర్చించిన అంశాల ప్రకారం శాఖల వారీగా పట్టణంలో కావలసిన మౌలిక వసతుల ఏర్పాటులో అన్ని ప్రభుత్వ శాఖలు, ఆలయ కమిటీ కలిసి సమన్వయంతో పని చేసి పండుగను విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. సామాన్య భక్తుల దర్శనాలకు అంతరాయం కలిగించకూడదన్నారు. పండుగ జరిగే రోజుల్లో విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలన్నారు.

మంచినీటి సరఫరాకు చర్యలు

మున్సిపల్‌ కమిషనరు జె.రామ అప్పలనాయుడు మాట్లాడుతూ మంచినీటి సరఫరా కోసం తోటపల్లి రిజర్వాయరు నుండి నీరు విడుదల చేసినట్టు తెలిపారు. శానిటేషన్‌ పనులు, పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ శాఖలు కలిసి ఏర్పాట్లు చేస్తున్నామని, పండుగ రోజుల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, శివారు ప్రాంతాలకు ట్యాంకర్లు ద్వారా నీరు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సీఐ కృష్ణారావు మాట్లాడుతూ బందోబస్తుకు సంబంధించి అదనపు సిబ్బందిని నియమించామని, ఊరేగింపు రూటు, సాధారణ ప్రజల ఆలయ దర్శనాలు, ముఖ్యుల దర్శనాలలో ఇబ్బందులు లేకుండా పోలీసు అధికారులు పర్యవేక్షణ జరుగుతుందన్నారు. పండుగ నిర్వాహకులు అందించిన ఊరేగింపు రూటుమ్యాపు ప్రకారం సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. సమావేశంలో ఉత్సవ కమిటీ సభ్యులు బి.జయబాబు, బి.సీతారాం, దేవదాయ, వైద్య ఆరోగ్య, విద్యుత్‌, రోడ్లు భవనాలు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

బంగారమ్మతల్లి
1/2

బంగారమ్మతల్లి

ఎర్ర కంచమ్మ
2/2

ఎర్ర కంచమ్మ

Advertisement

తప్పక చదవండి

Advertisement