‘లోదుస్తులపై స్టాంప్‌ ఉండాలి.. స్మెల్‌ పరీక్ష చేయించుకోవాలి’

3 Aug, 2021 12:50 IST|Sakshi

చండిగఢ్‌: ‘మీరు వేసుకునే లోదుస్తులపై స్టాంప్‌ ఉండాలి. స్మెల్‌ టెస్ట్‌ చేయించుకోవాలి’ అని ఓ క్లబ్‌ యాజమాన్యం సభ్యులకు ఆదేశాలు జారీ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. జిమ్‌కు వచ్చేవారందరూ ఇది తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ వార్త సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఎందుకు అలా చెప్పారో.. కథ ఏమిటో తెలుసుకోండి.

చండీగఢ్‌లోని లేక్‌ క్లబ్‌ ఇటీవల సభ్యులకు కొత్త నియమనిబంధనలు విడుదల చేసింది. అందులో భాగంగా పలు సూచనలు చేసింది. వాటిలో పైన పేర్కొన్న ప్రధాన సూచన సభ్యులను విస్మయానికి గురి చేసింది. ఈ రూల్స్‌కు సంబంధించిన ఫొటోను జర్నలిస్ట్‌ ఆర్ష్‌దీప్‌ సంధు ట్విటర్‌లో పంచుకోవడంతో ఈ విషయం బహిర్గతమైంది. నాలుగు సూచనలతో ఉన్న ఈ ఫొటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

  • జిమ్‌కు వచ్చేవారు సరైన దుస్తులు ధరించి రావాలి. జిమ్‌ సూట్లలోనే రావాలి. లోదుస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలి. అనుమతి ఇచ్చిన వాటినే వేసుకోవాలి. ఆ దుస్తులు ఎలా ఉండాలో కార్యాలయంలో కొన్ని శాంపిల్స్‌ ఉన్నాయి. చూసుకోవచ్చు. మీ దుస్తులకు అనుమతి కోసం సభ్యులు మా వద్దకు తీసుకురావాలి. స్టాంప్‌లు వేసిన దుస్తులనే వేసుకోవాలి.
  • సభ్యులు సరైన బూట్లు ధరించాలి. పరిశుభ్రంగా ఉండాలి. సాక్స్‌లు రోజుకొకసారి తప్పనిసరిగా ఉతకాలి. అపరిశుభ్రమైన బూట్లు.. వాసన వచ్చే సాక్స్‌లు ధరిస్తే ఆ సభ్యులకు జరిమానా విధిస్తాం. వాసన పరీక్ష (స్మెల్‌ టెస్ట్‌)లో మీరు ఫెయిలైతే చర్యలు ఉంటాయి. శారీరక దుర్వాసన కూడా రాకుండా చూసుకోవాలి. 
  • జిమ్‌ పరికరాలు శబ్ధం రాకుండా కసరత్తులు చేయాలి. కసరత్తులు చేసేప్పుడు అరవకూడదు.. శబ్దాలు చేయవద్దు. ఇతర భాషలు మాట్లాడేందుకు అనుమతి లేదు. కేవలం పంజాబీ భాషలోనే మాట్లాడాలి. అనుమతించిన తిట్లు మాత్రమే మాట్లాడాలి.
  • జిమ్‌కు షార్ట్స్‌ వేసుకుని వచ్చేవారు తమ కాళ్లను షేవ్‌ చేసుకుని రావాలి. ఏకాగ్రత కోల్పోకుండా కాళ్లకు పట్టీలు ఉంటే ఇంట్లో ఉంచి రావాలి. ఉల్లంఘించినవారు శిక్షార్హులు.

అని ఈ విధంగా నిబంధనలు పెట్టడంతో సభ్యులు ఖంగు తిన్నారు. జిమ్‌ చేయాలంటే ఇన్నేసీ రూల్సా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. మరికొందరు సోషల్‌ మీడియాలో ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇన్నేసి రూల్స్‌ పాటించాలా​? అని ప్రశ్నిస్తున్నారు. వాసన పరీక్షను సభ్యులు ఎలా పరాజయం పొందుతారు? అని ప్రశ్నిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు