యూవీ మెరుపులకు 13 ఏళ్లు

19 Sep, 2020 13:49 IST|Sakshi

ఢిల్లీ : భారత మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌  పేరు వింటే మొదట గుర్తు వచ్చేది 2007 టీ20 ప్రపంచకప్‌. సెప్టెంబర్‌ 19, 2007.. యూవీ కెరీర్లో మరుపురానిదిగా నిలిచిన రోజు.. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాది వీరవిహారం చేసిన రోజు... టీ20 మజా అంటే ఏంటో అభిమానులకు చూపించిన రోజు.. తనకు కోపం వస్తే అవతలి బౌలర్‌ ఎవరని చూడకుండా సుడిగాలి తుఫాను అంటే ఏంటో చూపించిన రోజు.. సరిగ్గా ఈరోజుతో ఆ విధ్వంసానికి 13 ఏళ్లు నిండాయి. మళ్లీ ఒకసారి ఆ మ్యాచ్‌ విశేషాలను గుర్తు చేసుకుందాం.  (చదవండి : 'ఐపీఎల్‌ యాంకరింగ్‌ మిస్సవుతున్నా')

డర్బన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 16.4 ఓవర్లు ముగిసే సమయానికి 155/3తో నిలిచిన దశలో యువరాజ్ సింగ్ క్రీజులోకి వెళ్లాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన ప్లింటాఫ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ వరుసగా 4, 4 బాదగా.. ప్లింటాఫ్ నోరు జారాడు. దాంతో.. మైదానంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరు కొట్టుకోవడానికి కూడా రెడీ అయ్యారు. అయితే అంపైర్లతో పాటు ఇరు జట్ల కెప్లెన్లు కల్పించుకొని సర్దిచెప్పారు.

అయితే అప్పటికే కోపంతో ఊగిపోతున్న యూవీ తన కోపాన్ని మొత్తం తరువాతి ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన స్టువర్ట్ బ్రాడ్ మీద చూపించాడు.ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6, 6, 6, 6 బాదిన యువరాజ్ సింగ్.. టీ20 వరల్డ్‌కప్‌లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. అలానే 12 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకోవడం ద్వారా టీ20ల్లో వేగంగా అర్ధశతకం నమోదు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. (చదవండి : ఐపీఎల్‌ 2020 : ఇట్లు.. ప్రేమతో మీ 'కార్తీకదీపం' దీప)

ఫ్లింటాఫ్‌ చేసిన పనికి తాను బలయ్యానని.. చాలా రోజుల వరకు ఈ పీడకల వెంటాడుతుండేదని బ్రాడ్‌ చెప్పుకొచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేయగా.. ఛేదనలో ఇంగ్లాండ్ 200/6కే పరిమితమై ఓటమిపాలయ్యింది.  ఆ తర్వాత భారత్‌ ఫైనల్లో పాక్‌ను ఓడించి మొదటి టీ20 ప్రపంచకప్‌ గెలిచిన సంగతి తెలిసిందే. 2007 టీ20 ప్రపంచకప్‌.. యూవీ కెరీర్‌ టర్నింగ్‌ పాయింట్‌ అని కూడా చెప్పొచ్చు.

యూవీ ఆడిన ఇన్నింగ్స్‌ అభిమానుల్లో ఎంతలా జీర్ణించుకుపోయిందంటే.. ఎవరు మాట్లాడినా.. ఆరు సిక్సులకు ముందు.. ఆ తర్వాత అంటూ పేర్కొనేవారు. అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోని యూవీ 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో వరల్డ్‌ కప్‌ హీరోగా నిలిచి.. 28 ఏళ్ల తర్వాత టీమిండియా కప్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. క్రికెట్‌ మిగిలిఉన్నంత వరకు యూవీ ఆడిన ఈ ఇన్నింగ్స్‌ రికార్డుల పుట్టలో పదిలంగా ఉంటుందనండంలో సందేహం లేదు. టీ20 కెరీర్‌లో 58 మ్యాచ్‌లాడిన యూవీ 1,177 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా యూవీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మ్యాచ్‌కు సంబంధించిన ఫోటోను షేర్‌ చేశాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు