Babar Azam: అతడి కెరీర్‌ నాశనం చేస్తున్నారు! బాబర్‌ ఆజం, రిజ్వాన్‌ను నమ్ముకుంటే పాక్‌ ఏ టోర్నీ గెలవలేదు!

15 Sep, 2022 12:02 IST|Sakshi
మహ్మద్‌ రిజ్వాన్‌- బాబర్‌ ఆజం

Asia Cup 2022- Pakistan- T20 World Cup 2022: బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌ను నమ్ముకుంటే పాకిస్తాన్‌ ఏ టోర్నీ కూడా గెలవలేదంటూ ఆ జట్టు మాజీ పేసర్‌ అకిబ్‌ జావేద్‌ అన్నాడు. టీ20 ఫార్మాట్‌లో ప్రపంచంలోని టాప్‌ బ్యాటర్లుగా పేరొందినా జట్టుకు మాత్రం ఉపయోగపడే ఇన్నింగ్స్‌ ఆడటం లేదంటూ విమర్శించాడు. ఈ ఓపెనర్లతో పాకిస్తాన్‌ ఐసీసీ టోర్నీలు గెలిచే అవకాశం లేదంటూ వ్యాఖ్యానించాడు.

విఫలమైన బాబర్‌ ఆజం!
ఆసియా కప్‌-2022 టోర్నీలో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆడిన ఆరు ఇన్నింగ్స్‌లో ఈ ‘స్టార్‌ ఓపెనర్‌’ చేసిన మొత్తం పరుగులు 68. ఈ నేపథ్యంలో ఐసీసీ తాజా టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి దిగజారాడు.

అదరగొట్టిన రిజ్వాన్‌.. అయినా!
ఇదిలా ఉంటే.. మరో ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ మాత్రం 281 పరుగులతో రాణించాడు. ఆసియా కప్‌-2022 టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు. కీలక మ్యాచ్‌లలో జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ తన ఇన్నింగ్స్‌తో విజయాలు అందించాడు. అయితే, ఫైనల్లో శ్రీలంకతో మ్యాచ్‌లో మాత్రం మ్యాజిక్‌ రిపీట్‌ చేయలేకపోయాడు. 49 బంతుల్లో 55 పరుగులు చేశాడు. 

ఎప్పుడు ఎలా ఆడాలో తెలియదు! దూకుడేది?
ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ పేసర్‌ అకిబ్‌ జావేద్‌.. బాబర్‌ ఆజం, రిజ్వాన్‌ స్ట్రైక్‌రేటును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ ఇద్దరు ఓపెనర్లు మేజర్‌ టోర్నీల్లో గెలిపించలేరు. బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌ ప్రపంచంలో నంబర్‌ 1,2 ఆటగాళ్లుగా పేరొందారు. 

అలాంటి బ్యాటర్లకు ఎప్పుడు ఎలా ఆడాలో తెలియాలి కదా! వైస్‌ కెప్టెన్‌ రిజ్వాన్‌ విషయానికొస్తే.. ఆసియా కప్‌లో శ్రీలంకతో ఫైనల్‌ మ్యాచ్‌లో.. 15 ఓవర్ల పాటు ఆడాడు. అవసరమైన రన్‌రేటు 8 ఉన్నప్పటి నుంచి అది 17కు పెరిగేంత వరకు ఉన్నాడు. ఇలాంటి ఆట తీరుతో వీళ్లేం గెలుస్తారు’’ అని జావేద్‌ పెదవి విరిచాడు.

అతడి కెరీర్‌ను నాశనం చేస్తున్నారు!
అదే విధంగా ఫఖర్‌ జమాన్‌ను మూడో స్థానంలో​ బ్యాటింగ్‌కు పంపడంపై స్పందిస్తూ.. ‘‘మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపి అతడి కెరీర్‌ను నాశనం చేస్తున్నారు. నిజానికి బాబర్‌ లేదంటే రిజ్వాన్‌తో కలిసి ఓపెనర్‌గా వస్తేనే జట్టుకు ఉపయోగం ఉంటుంది.

ఓపెనర్‌గా తను రాణించగలడు’’ అని అకిబ్‌ జావేద్‌ అభిప్రాయపడ్డాడు. కాగా ఆసియాకప్‌-2022 రన్నరప్‌గా నిలిచిన పాకిస్తాన్‌.. ఆస్ట్రేలియా వేదికగా ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీకి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అకిబ్‌ జావేద్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

చదవండి: T20 WC 2022: ‘ప్రపంచకప్‌ తర్వాత కోహ్లి రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడు’! ఎందుకంటే!
'కర్మ ఫలితం అనుభవించాల్సిందే'‌.. ఎంతైనా పాక్‌ క్రికెటర్‌!

మరిన్ని వార్తలు