T20 WC 2022: టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌.. కెప్టెన్‌ దూరం!

1 Nov, 2022 13:00 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో కీలక మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌ తగిలే అవకాశం ఉంది. ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ గాయం కారణంగా ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. కాగా సోమవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫించ్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఈ మ్యాచ్‌లో 44 బంతులు ఎదుర్కొన్న ఫించ్‌.. 5 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 63 పరుగులు సాధించాడు. అయితే  ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌ అఖరిలో ఫించ్‌ తొడ కండరాలు పట్టేశాయి. అయినప్పటికీ బాధను భరిస్తూనే ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. అనంతరం సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఫించ్‌ ఫీల్డ్‌లోకి రాలేదు.

అతడి స్థానంలో వైస్-కెప్టెన్ మాథ్యూ వేడ్ బాధ్యతలు స్వీకరించాడు. ఇక తన గాయంకు సంబంధించిన అప్‌డేట్‌ను  మ్యాచ్‌ అనంతరం ఫించ్‌ వెల్లడించాడు. "ప్రస్తుతం చాలా నొప్పిగా ఉంది. నేను రేపు(మంగళవారం) స్కానింగ్‌ కోసం వెళ్తాను. గతంలో కూడా ఇదే గాయంతో బాధపడ్డాను.

స్కాన్‌ రిపోర్ట్స్‌ బట్టి విశ్రాంతి తీసుకోవాలా వద్ద అన్నది ఆలోచిస్తాను" అని ఫించ్‌ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 42 పరుగుల తేడాతో ఆసీస్‌ ఘన విజయం సాధించింది. ఇక  నవంబర్‌ 4న ఆడిలైడ్‌ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో ఆస్ట్రేలియా తలపడనుంది.


చదవండి: T20 WC 2022: 'బాబర్‌ అజం స్వార్దపరుడు.. కేవలం రికార్డుల కోసం మాత్రమే'

>
మరిన్ని వార్తలు