Lionel Messi: చెత్త టీం నుంచి ఆఫర్లు.. అభిమానుల ఆగ్రహం

2 Jul, 2021 18:55 IST|Sakshi

ప్రపంచంలోనే ఖరీదైన ఫుట్‌బాల్‌ ఆటగాడిగా లియోనెల్‌ మెస్సీ(34)కి ఘనత ఉంది. అయితే తాజాగా బార్సిలోనాతో అతని కాంట్రాక్ట్‌ ముగిసింది. దీంతో మెస్సీ పయనమెటు? గందరగోళంలో మెస్సీ? అనే శీర్షికలతో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో చిన్న టీంల నుంచి చెత్త టీంల దాకా ప్రతీ ఒక్క క్లబ్‌లు మెస్సీకి బంపరాఫర్లు ప్రకటిస్తున్నాయి ఇప్పుడు. 

లియోనెల్‌ మెస్సీ.. ఇప్పుడు ఫ్రీ ఏజెంట్‌. బార్సిలోనాతో నాలుగేళ్ల ఒప్పందం జూన్‌ 30 అర్థరాత్రితో ముగిసింది. దాదాపు 500 మిలియన్ల డాలర్ల ఒప్పందంగా.. ప్రపంచంలోనే కాస్ట్‌లీ ప్లేయర్‌ కాంట్రాక్ట్‌ల్లో ఒకటిగా నిలిచింది. ఎన్‌బీఎ, నేషనల్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌, బేస్‌బాల్‌ లీగ్‌లోనూ ఏ ఆటగాడితో ఇంతటి కాస్ట్‌లీ కాంట్రాక్ట్‌లు జరగలేదు. ఇదిలా ఉంటే బ్రెజిల్‌ ఐబిస్‌ స్పోర్ట్‌ క్లబ్‌ నుంచి వచ్చిన మెస్సీకి ఆఫర్‌ గురించి పెద్ద ఎత్తున్న చర్చ నడుస్తోంది.

ప్రపంచంలోనే చెత్త ఫుట్‌బాల్‌ టీంగా ఐబిస్‌ స్పోర్ట్‌ క్లబ్‌ పేరుంది. అంతేకాదు. డెబ్భై నుంచి ఎనభై దశకాల మధ్య దాదాపు నాలుగేళ్లపాటు ఒక్క గేమ్‌ కూడా గెల్వని రికార్డ్‌ ఈ క్లబ్‌ సొంతం. ఇక అలాంటి క్లబ్‌ మెస్సీకి కొన్ని షరతుల మీద ఒప్పంద పత్రాన్ని ప్రకటించింది. పదిహేనేళ్ల కాంటాక్ట్‌, అదీ మెరిట్‌ బేస్‌ మీద జీతం, గోల్స్‌ చేయకుంటే కాంట్రాక్ట్‌ రద్దు చేసి క్లబ్‌ నుంచి తొలగించడం, కాంటాక్ట్‌ రద్దైతే తర్వాత ఛాంపియన్‌ అనే ట్యాగ్‌ను తీసేయడం, పదో నెంబర్‌ జెర్సీ వేసుకోవద్దని.. అది తమ లెజెండ్‌ మారో షాంపూకి మాత్రమే సొంతమని , ఇక క్లబ్‌లో చేరే ముందు మారడోనా కంటే పీలే గొప్పోడని అద్దం ముందు మూడుసార్లు ప్రతిజ‍్క్ష చేయాలనే కండిషన్‌.. ఇలా చిత్రమైన ఒప్పందాలతో మెస్సీకి ఆహ్వానం ఆఫర్‌ ప్రకటించింది ఆ క్లబ్‌. దీంతో మండిపడుతున్నారు అతని ఫ్యాన్స్‌. ఇక మెస్సీ పీఆర్‌ టీం కూడా ఈ వ్యవహరంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే  ఇలాంటి వ్యవహారాలను పట్టించుకునేంత తీరిక మెస్సీకి లేదని ప్రకటించింది. 

ఇక ఈ ఫ్రీ ఏజెంట్‌ కోసం.. చిన్నచితకా క్లబ్‌లు సైతం పోటీ పడుతున్నాయి. మెస్సీ స్వస్థలం రోసారియో నుంచి నెవెల్స్‌ ఓల్డ్‌ బాయ్స్‌ క్లబ్‌ ఆసక్తి చూపిస్తోంది. సొంత జట్టుకు వచ్చేయమంటూ ట్విటర్‌ ద్వారా అతనికి ఆహ్వానం కూడా పలికింది. ఎస్టాడియో మార్సెలో బైస్లా స్టేడియం వద్ద మెస్సీ.. పేరుతో పెద్ద కట్‌ అవుట్‌లు(మ్యూరాల్స్‌) ఏర్పాటు చేయించింది కూడా. ఇక  తన కెరీర్‌ చివర్లో తాను సొంత గూటికే వెళ్తానని చాలాసార్లు మెస్సీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీంతో ఆశలు పెట్టుకుంది ఓల్డ్‌ బాయ్స్‌. ఇక నెదర్లాండ్స్‌కు చెందిన వోలెన్‌డామ్‌ క్లబ్‌, రియల్‌ సాల్ట్‌ లేక్‌(అమెరికా) కూడా మెస్సీకి ఆహ్వానం పలకడం విశేషం.

మరి మెస్సీ మనసులో.. 
సాధారణంగా బార్సిలోనా ఈ సాకర్‌ మాంత్రికుడి కాంట్రాక్ట్‌ రెన్యువల్‌కోసమే ప్రయత్నిస్తుంది. కానీ, 1 బిలియన్‌ డాలర్ల అప్పుల్లో క్లబ్‌ కూరుకుపోవడం, పైగా కరోనా దెబ్బకి ఆర్థికంగా కుదేలుకావడంతో కాంట్రాక్ట్ రెన్యువల్‌ అయ్యేనా? అనే అనుమానాలు ఉన్నాయి. అయితే క్లబ్‌ ప్రెసిడెంట్‌ జోవాన్‌ లపోర్టా స్పందించాడు. అతను మాతో ఉండాలనే మేం అనుకుంటున్నాం. అతనూ కోరుకుంటున్నాడు. అంతా సవ్యంగానే ఉందని వ్యాఖ్యానించాడాయన. మరి మెస్సీ మనసులో ఏముందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

చదవండి: యూరో 2020.. కరోనా అంటించుకున్న ఆ దేశ అభిమానులు

మరిన్ని వార్తలు