IND VS BAN 1st Test Day 2: అశ్విన్‌ హాఫ్‌ సెంచరీ.. కేఎల్‌ రాహుల్‌ కంటే వెయ్యి రెట్లు బెటర్‌ అంటున్న ఫ్యాన్స్‌

15 Dec, 2022 15:47 IST|Sakshi

చట్టోగ్రామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా భారీ స్కోర్‌ సాధించింది. పుజరా (90), శ్రేయస్‌ అయ్యర్‌ (86), అశ్విన్‌ (58)లు హాఫ్‌ సెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులు చేసింది. 278/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌..  మరో 126 పరుగులు జోడించి ఆలౌటైంది.

శ్రేయస్‌ అయ్యర్‌ ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో 4 పరుగులు మాత్రమే జోడించి ఔట్‌ కాగా.. టెయిలెండర్లు అశ్విన్‌, కుల్దీప్‌ యాదవ్‌ (40) బంగ్లా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ముఖ్యంగా అశ్విన్‌.. స్పెషలిస్ట్‌ బ్యాటర్‌లా షాట్లు ఆడి కెరీర్‌లో 13వ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. అశ్విన్‌-కుల్దీప్‌లు ఎనిమిదో వికెట్‌కు 92 పరుగులు జోడించి భారత్‌ భారీ స్కోర్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించారు.

కాగా, అశ్విన్‌ హాఫ్‌ సెంచరీతో రాణించిన అనంతరం సోషల్‌మీడియా వేదికగా భారత క్రికెట్‌ అభిమానులు అతన్ని అభినందిస్తున్నారు. అశ్విన్‌.. స్పెషలిస్ట్‌ బ్యాటర్ల కంటే మెరుగ్గా ఆడాడని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అశ్విన్‌ ఆటతీరు కేఎల్‌ రాహుల్‌ కంటే వెయ్యి రెట్లు బెటర్‌ అని కామెంట్లు చేస్తున్నారు.

లోయర్‌ ఆర్డర్‌లో అశ్విన్‌ లాంటి ఆటగాడు ఉండటం టీమిండియాకు అదనపు బలమని అంటున్నారు. ఇటీవలి కాలంలో తరుచూ విఫలమవుతున్న రాహుల్‌ను టార్గెట్‌ చేసుకుని వ్యంగ్యమైన కామెంట్లు చేస్తున్నారు. అశ్విన్‌ను చూసైనా రాహుల్‌ సిగ్గు తెచ్చుకోవాలని పరుష పదజాలంతో దూషిస్తున్నారు. 

ఇదిలా ఉంటే, కెరీర్‌లో 87వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న అశ్విన్‌ బౌలింగ్‌తో పాటు అవపరమైనప్పుడు బ్యాటింగ్‌లోనూ రాణిస్తూ కీలక సమయాల్లో విలువైన పరుగులు సమకూరుస్తున్నాడు. అశ్విన్‌ టెస్ట్‌ల్లో 27.17 సగటున 2989 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 13 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

ఈ గణాం‍కాలు చూస్తే లోయర్‌ ఆర్డర్‌లో అతనెంత విలువైన ఆటగాడో అర్ధమవుతుంది. 8వ స్థానంలో దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ (13) తర్వాత అశ్వినే అత్యధిక హాఫ్‌ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్లలో కోహ్లి (8075), పుజారా (6882), రోహిత్‌ శర్మ (3137) తర్వాత అశ్విన్‌వే అత్యధిక టెస్ట్‌ పరుగులు కావడం విశేషం.     
 

మరిన్ని వార్తలు