టీమిండియా స్పిన్నర్‌ అరుదైన ఘనత.. 11 ఏళ్ల తర్వాత మళ్లీ అలా..

12 Jul, 2021 17:08 IST|Sakshi

లండన్‌: టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. 11 ఏళ్ల తర్వాత కౌంటీ క్రికెట్లో తొలి ఓవర్‌ వేసిన స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2010లో న్యూజిలాండ్ స్పిన్నర్ జీతన్‌ పటేల్‌ ఆరంభ ఓవర్‌ వేయగా.. మళ్లీ ఇన్నాళ్లకు అశ్విన్‌ ఇన్నింగ్స్ తొలి బంతిని వేశాడు. ఆదివారం సోమర్‌సెట్‌తో జరిగిన కౌంటీ మ్యాచ్‌లో సర్రే తరఫున బరిలోకి దిగిన అశ్విన్.. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేశాడు. పిచ్‌ మందకొడిగా ఉండటంతో సర్రే కెప్టెన్ రోరీ బర్న్స్‌ కొత్త బంతిని అశ్విన్‌కు అప్పజెప్పాడు. తొలిరోజు 28 ఓవర్లు వేసిన అశ్విన్‌.. 70 పరుగులిచ్చి ఓ వికెట్‌ పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ ఎక్కువగా వైవిధ్యం ప్రదర్శించలేదు. పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని ఒకే ప్రాంతంలో నిలకడగా బంతులు విసిరి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చాడు. మ్యాచ్ సాగుతున్న కొద్ది బంతి ఎక్కువగా టర్న్‌ కాకపోవడంతో అశ్విన్‌ తెలివిగా బౌలింగ్‌ చేశాడు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి సోమర్‌సెట్‌ 98 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 280 పరుగులు స్కోర్‌ చేసింది. ఇదిలా ఉంటే, టీమిండియా ఇదే మైదానంలో ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు ఆడనుంది.

కాగా, ప్రస్తుతం టీమిండియా సభ్యులకు విరామం దొరకడంతో ఇంగ్లండ్ పరిసరాల్లో కుటుంబ సభ్యులతో పాటు పర్యటిస్తున్నారు. ఐసీసీ ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ముగిశాక భారత ఆటగాళ్లకు మూడు వారాల విరామం దొరికింది. ఈ మధ్యలో యాష్‌కు అనుకోకుండా సర్రే జట్టు నుంచి ఆహ్వానం అందింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు ఈ కౌంటీ మ్యాచ్‌ ద్వారా మంచి ప్రాక్టీస్‌ దొరుకుతుందని భావించిన యాష్.. వెంటనే సర్రే జట్టు ఆహ్వానాన్ని అంగీకరించాడు. కాగా, యాష్‌కు గతంలో నాటింగ్హమ్‌షైర్‌, వొర్సెస్టర్‌షైర్‌ కౌంటీలకు ఆడిన అనుభవం ఉంది.

మరిన్ని వార్తలు