వెటోరీలా బౌల్‌ చేస్తున్నావన్నారు, గంగూలీకి బౌల్‌ చేయించారు, ఇప్పుడేమో..!

6 Jul, 2021 21:18 IST|Sakshi

గువహాటీ: టీమిండియా 2003లో న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లక ముందు, నాటి జట్టు సారధి సౌరవ్‌ గంగూలీకి నెట్స్‌లో బౌలింగ్‌ చేసి సహాయపడిన అసోంకు చెందిన మాజీ క్రికెటర్‌ ప్రకాశ్ భగత్‌.. ప్రస్తుతం దుర్భర జీవితాన్ని గడుపుతున్నాడు. పొట్టకూటి కోసం రోడ్డు పక్కన దాల్‌ పూరి దుఖానాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. నాడు న్యూజిలాండ్ టూర్‌కి వెళ్లబోయిన భారత జట్టుకు స్పిన్నర్ డేనియల్ వెటోరీ ఫోబియా పట్టుకుంది. భిన్నమైన బౌలింగ్ యాక్షన్‌తో బంతుల్ని సంధించే వెటోరీ.. సొంతగడ్డపై భారత బ్యాట్స్‌మెన్‌లకి సవాల్ విసిరేలా కనిపించాడు. దాంతో నాటి టీమిండియా కెప్టెన్ గంగూలీ.. బీసీసీఐతో చర్చల జరిపి వెటోరీలా బౌల్‌ చేసే ఎడమ చేతి వాటం స్పిన్నర్ ప్రకాశ్ భగత్‌ను ఆగమేఘాల మీద బెంగళూరుకి పిలిపించాడు.  

బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో గంగూలీతో పాటు భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లకు ప్రకాశ్ భగత్ నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. ప్రకాశ్‌ బౌలింగ్‌ యాక్షన్‌.. వెటోరీ బౌలింగ్ యాక్షన్‌ని పోలి ఉండటంతో భారత బ్యాట్స్‌మెన్లందరూ అతని బౌలింగ్‌లో కఠోర సాధన చేశారు. దీంతో టీమిండియా బ్యాట్స్‌మెన్లు న్యూజిలాండ్ టూర్‌లో వెటోరీపై ఎదురుదాడి చేయగలిగారు. ఇలా టీమిండియాకు ఉపయోగపడిన ఆ బౌలర్‌ ప్రస్తుతం రోడ్డు పక్కన దాల్‌ పూరి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చాలీచాలని సంపాదనతో బతుకు బండిని నెట్టుకొస్తున్నాడు. తనతో పాటు అసోంకు ఆడిన క్రికెటర్లు.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారని, తనకు మాత్రం బోర్డు నుంచి ఏ తోడ్పాటు అందకపోవడంతో ఇలా బతుకు బండిని నెట్టుకొస్తున్నాని ఈ 38 ఏళ్ల క్రికెటర్‌ వాపోతున్నాడు. తాజాగా ఇన్.కామ్‌ అనే వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాశ్‌ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

కాగా, అసోం తరఫున దాదాపు అన్ని స్థాయి పోటీల్లోనూ పాల్గొన్న ప్రకాశ్.. బీహార్‌తో జరిగిన ఓ రంజీ మ్యాచ్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇందులో హ్యాట్రిక్ కూడా ఉంది. ప్రకాశ్ చివరిసారిగా 2010-11లో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడాడు. ఆ తర్వాత అతని తండ్రి చనిపోవడంతో క్రమంగా క్రికెట్‌కి దూరమై.. కుటుంబ బాధ్యతలను భుజాలపై వేసుకున్నాడు. నాడు తన బౌలింగ్‌ ద్వారా లబ్ధి పొందిన గంగూలీ ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి అధ్యక్షుడిగా కొనసాగుతుండగా, ప్రకాశ్‌ మాత్రం బతుకు బండిని నెట్టుకొస్తున్నాడు.
 

మరిన్ని వార్తలు