‘అథ్లెటిక్స్‌ను మరింత మార్కెటింగ్‌ చేయాలి’

30 Nov, 2023 01:12 IST|Sakshi

భారత్‌లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్లను మరింత ఆకర్షణీయంగా మార్చాల్సిన అవసరం ఉందని స్టార్‌ అథ్లెట్, ఒలింపిక్‌ స్వర్ణపతక విజేత నీరజ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఎక్కువ మంది అభిమానులకు చేరువయ్యేందుకు తగినంత మార్కెటింగ్‌ కూడా చేయాలని అతను అన్నాడు. ‘డైమండ్‌ లీగ్, కాంటినెంటల్‌ టూర్స్, వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌ వంటి పెద్ద ఈవెంంట్లను భారత్‌లో ప్రసారం చేయాలి. ప్రస్తుతం హైలైట్స్‌ మాత్రమే మనకు అందుబాటులో ఉంటున్నాయి.

రాత్రి 1–2 వరకు మేల్కొని అభిమానులు అథ్లెటిక్స్‌ చూసేందుకు సిద్ధమైనా, వారికి ఆ అవకాశం ఉండటం లేదు’ అని నీరజ్‌ అన్నాడు. కెన్యా, గ్రెనడాలాంటి దేశాలు కూడా ప్రపంచ స్థాయి అథ్లెటిక్స్‌ పోటీలను నిర్వహిస్తుండగా మనం ఎందుకు చేయలేమని నీరజ్‌ వ్యాఖ్యానించాడు. ‘నేను వరల్డ్‌ అథ్లెటిక్స్‌ అధికారులను ఎప్పుడు కలిసినా వారు భారత్‌లో ఇలాంటి ఈవెంట్‌ నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అదే జరిగితే ఎక్కువ మంది అథ్లెటిక్స్‌ను చూసి ఆకర్షితులవుతారనేది నా నమ్మకం’ అని నీరజ్‌ చెప్పాడు.   

మరిన్ని వార్తలు