పకడ్బందీగా రేషన్‌ పంపిణీ | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా రేషన్‌ పంపిణీ

Published Thu, Nov 30 2023 1:12 AM

మాట్లాడుతున్న పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌   - Sakshi

తిరుపతి అర్బన్‌ : కార్డుదారులకు సకాలంలో పకడ్బందీగా రేషన్‌ పంపిణీ చేయాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ ప్రతి నెలా 1 నుంచి 17వ తేదీలోపు బియ్యంతోపాటు ఇతర సరుకులను ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ చేయాలన్నారు. డిసెంబర్‌ నుంచి కేజీ రాగులు అందించాలని స్పష్టం చేశారు. కార్డుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని చెప్పారు. ఎండీయూ వాహనం వచ్చే ముందు రోజే వలంటీర్ల ద్వారా కార్డుదారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రజల ఆరోగ్యరక్షణే పరమావధిగా ప్రభుత్వం నాణ్యమైన సార్టెక్స్‌ బియ్యం పంపిణి చేస్తోందని వివరించారు. రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గోదాముల వద్ద సరుకుల తూకం తక్కువగా ఉంటోదని డీలర్లు ఫిర్యాదు చేస్తున్నారని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అవకతవకలకు పాల్పడితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని సూచించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ బాలాజీ, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజారఘువీర్‌, సివిల్‌ సప్లయి జిల్లా మేనేజర్‌ సుమతి, డీఈఓ శేఖర్‌, గూడూరు ఆర్డీఓ కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement