IND VS AUS: ఆసీస్‌ను భయపెట్టిన స్వీప్‌, రివర్స్‌ స్వీప్‌

19 Feb, 2023 16:24 IST|Sakshi

బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టు కూడా రెండున్నర రోజుల్లోనే ముగిసిపోయింది. తొలి టెస్టుకు మించి దారుణ ఆటతీరు కనబరిచిన ఆసీస్‌ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. జడేజా బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియకు ఆసీస్‌ బ్యాటర్లు తలలు పట్టుకున్నారు. ఆసీస్‌ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో స్వీప్‌షాట్స్‌ ఆడేందుకు ఎక్కువగా ప్రయత్నించారు.

ఇప్పుడు అవే స్వీప్స్‌ వారి కొంపముంచింది. ఆస్ట్రేలియా బలహీనతను ముందే పసిగట్టిన జడేజా తన ప్రతీ ఓవర్లో లోబాల్స్‌ ఎక్కువగా వేశాడు. దీంతో ఆసీస్‌ బ్యాటర్లకు గత్యంతరం లేక స్వీప్‌, రివర్స్‌స్వీప్‌కు యత్నించడం.. ఔటవ్వడం.. మ్యాచ్‌ మొత్తం ఇదే రిపీట్‌ అయ్యింది. జడేజా ఏడు వికెట్లు తీస్తే ఇందులో ఐదు క్లీన్‌బౌల్డ్‌ రూపంలో వచ్చాయంటేనే ఆసీస్‌ ఆడిన తీరును అర్థం చేసుకోవచ్చు. అందుకే తెలివిగా బౌలింగ్‌ చేసిన జడ్డూ లోబాల్‌ వేస్తూనే బంతి స్టంప్‌ ముందు పడేలాగా చూసుకున్నాడు.

ఇది అతనికి మంచి ఫలితాన్ని ఇచ్చింది. మ్యాచ్‌ ఓటమి తర్వాత ఆసీస్‌ దిగ్గజాలు మాథ్యూ హెడెన్‌, అలెన్‌ బోర్డర్‌లు ఆస్ట్రేలియా ఆటను తప్పుబట్టారు. ''జడేజా బౌలింగ్‌ ఎలా వేస్తున్నాడనేది గమనించకుండా ప్రతీసారి స్వీప్‌,  రివర్స్‌స్వీప్‌ అంటూ చేతులు కాల్చుకున్నారు.. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలమని ముందు నుంచి చెబుతూనే వచ్చారు. జడ్డూ తెలివైన బౌలింగ్‌ మ్యాచ్‌ను టీమిండియావైపు తిప్పింది.'' అంటూ కామెంట్‌ చేశారు. 

అయితే ఆస్ట్రేలియా ఆలౌట్‌ అనంతరం 115 పరుగుల లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగింది. జడ్డూ ఉపయోగించిన స్ట్రాటజీనే ఆసీస్‌ స్పిన్నర్లు ఉపయోగించాలనుకున్నారు. కానీ వారి ప్లాన్‌ బెడిసికొట్టింది. స్పిన్నర్లను ఆడడంలో పుజారా, కోహ్లి మొనగాళ్లు. ఊరించే బంతులు వేస్తే ఈ ఇద్దరు ఇంకా బాగా ఆడగలరు. కోహ్లి విఫలమైనా.. పుజారా మాత్రం 31 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు బౌండరీలు ఉంటే అందులో రెండు స్వీప్‌, రివర్స్‌స్వీప్‌ ద్వారా వచ్చినవే కావడం విశేషం.

టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ... మేం చెప్పిన పాఠాన్ని మాకే రివర్స్‌ చేయాలనుకోవడం కరెక్ట్‌ కాదు.. జడ్డూ లో-బాల్స్‌  వేశాడని మీరు కూడా అలాగే చేస్తే ఫలితం రిపీట్‌ అవుతుందనుకోవడం వెర్రితనమే. పుజారా దగ్గర రివర్స్‌ స్వీప్‌ ఎలా ఆడాలో నేర్చుకోండి.. తర్వాత మ్యాచ్‌లో పనికొస్తుంది అంటూ చురకలు అంటించాడు.   

చదవండి: ఆసీస్‌పై రెండో టెస్ట్‌లో విక్టరీ.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా, ఇంకా రేసులో శ్రీలంక

'రీఎంట్రీ తర్వాత బౌలింగ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నా'

మరిన్ని వార్తలు