BGT 2023: ఇంటిబాట పట్టిన మరో ఆసీస్‌ ప్లేయర్‌.. ఈసారి ఆల్‌రౌండర్‌

22 Feb, 2023 15:04 IST|Sakshi

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా టీమిండియాతో జరుగబోయే మూడో టెస్ట్‌ మ్యాచ్‌కు (మార్చి 1 నుంచి ప్రారంభం) ముందు ఆసీస్‌ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ఇంటిబాట పడుతున్నారు. అసలే 0-2 తేడాతో సిరీస్‌లో వెనుకపడిన ఆసీస్‌కు.. ఈ విషయం మరింత ఇబ్బందికరంగా మారింది. గాయాల కారణంగా ఇప్పటికే స్టార్‌ పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌, వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సిరీస్‌ మొత్తం నుంచే నిష్క్రమించగా, వ్యక్తిగత కారణాల చేత కెప్టెన్‌ కమిన్స్‌ పాక్షికంగా లీవ్‌ తీసుకున్నాడు.

తాజాగా మరో ఆటగాడు స్వదేశంలో జరిగే దేశవాలీ టోర్నీల్లో ఆడేందుకు జట్టును వీడాడు. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ ఆస్టన్‌ అగర్‌.. షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీ, మార్ష్‌ కప్‌ ఫైనల్‌ ఆడేందుకు స్వదేశానికి బయల్దేరాడు. తొలి రెండు టెస్ట్‌ల్లో తుది జట్టులో ఆడే అవకాశం దక్కని అగర్‌ను ఆసీస్‌ యాజమాన్యమే రిలీజ్‌ చేసినట్లు తెలుస్తోంది. అతని స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని కూడా ప్రకటించలేదు. జట్టులో స్పిన్నర్లు అధికంగా ఉండటంతో అగర్‌ను ఉద్దేశపూర్వకంగానే తప్పించినట్లు తెలుస్తోంది.

నాథన్‌ లయోన్‌, టాడ్‌ మర్ఫీ రాణిస్తుండటంతో అగర్‌కు తుది జట్టులో అవకాశం దక్కడం కష్టమని భావించి ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు రెండో టెస్ట్‌కు ముం‍దు వ్యక్తిగత కారణాల చేత స్వదేశానికి వెళ్లిన స్పిన్నర్‌ మిచెల్‌ స్వెప్సన్‌ తిరిగి జట్టులో చేరాడు. స్వెప్సన్‌ గైర్హాజరీలో రెండో టెస్ట్‌లో మాథ్యూ కుహ్నేమన్‌ ఆడాడు. అరంగేట్రం టెస్ట్‌లోనే కోహ్లి వికెట్‌ తీసిన కుహ్నేమన్‌ కూడా పర్వాలేదనిపించాడు.

ఒక్కొక్కరుగా ఆటగాళ్లు వైదొలుగుతుండటంతో సిరీస్‌పై ఆశలు వదులుకున్న ఆసీస్‌కు ఓ విషయంలో మాత్రం ఊరట లభించింది. ఫిట్‌నెస్‌ సమస్య కారణంగా తొలి రెండు టెస్ట్‌ల్లో ఆడని పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కెమరూన్‌ గ్రీన్‌ మూడో టెస్ట్‌కు అందుబాటులో ఉండనున్నట్లు ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది.

గాయం కారణంగా తొలి రెండు టెస్ట్‌లకు దూరంగా ఉన్న స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ సన్నద్ధతపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే.. గాయాలు, ఆటగాళ్ల పేలవ ఫామ్‌ తదితర సమస్యల కారణంగా ఆసీస్‌ సిరీస్‌పై ఆశలు వదులుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. 4 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ కాకుండా  కాపాడుకోవడమే ప్రస్తుతం ఆసీస్‌ ముందున్న లక్ష్యమని అర్ధమవుతుంది.   

మరిన్ని వార్తలు