Ind Vs Aus: షమీ, అశ్విన్‌, జడ్డూ అదుర్స్‌.. మొదటి రోజే ముగిసిన ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌

17 Feb, 2023 16:29 IST|Sakshi
భారత జట్టు (PC: BCCI)

India vs Australia, 2nd Test: టీమిండియాతో రెండో టెస్టులో మొదటి రోజే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ ముగించింది. అయితే, నాగ్‌పూర్‌లో 177 పరుగులకే మొదటి ఇన్నింగ్స్‌ ముగించిన కమిన్స్‌ బృందం.. ఢిల్లీ మ్యాచ్‌లో 263 పరుగులు చేయగలిగింది. ఆసీస్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా(81), ఆరో స్థానంలో వచ్చిన పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌(72 నాటౌట్‌) రాణించారు.

చెలరేగిన షమీ, అశూ, జడ్డూ
దీంతో 78.4 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌట్‌ అయి తమ తొలి ఇన్నింగ్స్‌ ముగించింది ఆస్ట్రేలియా. ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(15)ను అవుట్‌ చేసి తొలి వికెట్‌ తీసిన టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ.. మొత్తంగా నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లతో సత్తా చాటారు. వార్నర్‌, ట్రావిస్‌ హెడ్‌, నాథన్‌ లియోన్‌, మాథ్యూ కుహ్నెమన్‌ వికెట్లు షమీ తన ఖాతాలో వేసుకోగా.. జడేజా ఖవాజా రూపంలో కీలక వికెట్‌ సాధించి పలు రికార్డులు నమోదు చేశాడు.

ఖవాజా ఒంటరి పోరాటం
అదే విధంగా ప్యాట్‌ కమిన్స్‌, టాడ్‌ మర్ఫీ వికెట్లను జడ్డూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అశ్విన్‌ మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, అలెక్స్‌ క్యారీ వికెట్లు సాధించాడు.  ఇదిలా ఉంటే.. ఆసీస్‌ బ్యాటర్లలో ఉస్మాన్‌ ఖవాజా(81) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ 33 పరుగులతో రాణించాడు. 

హ్యాండ్స్‌కోంబ్‌ విలువైన అర్ధ శతకం
ఇక ఆరో స్థానంలో వచ్చిన హ్యాండ్స్‌కోంబ్‌(72) అజేయ అర్ధ శతకంతో మెరిసి ఆసీస్‌ మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మిగతా వాళ్లంతా కనీసం 20 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయారు.

కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 132 పరుగులతో టీమిండియా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అరుణ్‌జైట్లీ స్టేడియంలో శుక్రవారం (ఫిబ్రవరి 17) మొదలైన రెండో టెస్టులోనూ పట్టు బిగించి.. విజయం సాధించి ఆధిక్యాన్ని 2-0కు పెంచుకోవాలని పట్టుదలగా ఉంది. 

చదవండి: IND Vs AUS: షమీ చెవులు పిండిన అశ్విన్‌.. ఫోటో వైరల్‌
BGT 2023: గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో రాహుల్‌ అద్భుత క్యాచ్‌.. బిత్తరపోయిన ఖవాజా.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు