Ind vs SA: వాళ్లిద్దరిలో ఒక్కరికే ఛాన్స్‌.. షమీ స్థానంలో అతడే!

25 Dec, 2023 10:18 IST|Sakshi

Gautam Gambhir's XI for 1st Test Against South Africa: ప్రపంచ నంబర్‌ వన్‌ టీమిండియా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమైంది. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో ఎదురైన పరాభవాన్ని మరిపించేలా చరిత్రాత్మక విజయం అందుకోవాలని పట్టుదలగా ఉంది. కాగా పేస్‌కు అనుకూలించే విదేశీ గడ్డపై ముఖ్యంగా SENA దేశాల(సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా)పై టెస్టు సిరీస్‌ గెలిస్తే ఆ మజానే వేరు!

‘సఫారీ’లో సాధ్యం కాలేదు
అయితే, టీమిండియా ఈ నాలుగు దేశాల్లోని మూడు ఆతిథ్య జట్లను మాత్రమే టెస్టు సిరీస్‌లో ఓడించగలిగింది. సౌతాఫ్రికాలో మాత్రం ఇంతవరకు భారత జట్టుకు ఈ ఫీట్‌ సాధ్యం కాలేదు. ఈసారైనా ఆ అపవాదును చెరిపివేయాలని రోహిత్‌ సేన పట్టుదలగా ఉంది.

ఒక్క స్పిన్నర్‌ చాలు
ఈ నేపథ్యంలో సఫారీ టీమ్‌తో తలపడే తుదిజట్టు కూర్పు ఎలా ఉంటే బాగుంటుందన్న అంశంపై భారత మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా గౌతం గంభీర్‌ తన అత్యుత్తమ ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. బౌన్సీ పిచ్‌లు ఉన్న సౌతాఫ్రికాలో టీమిండియా ఒక్క స్పిన్నర్‌తో బరిలోకి దిగితే చాలని ఈ సందర్భంగా గౌతీ అభిప్రాయపడ్డాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌లలో ఒకరిని మాత్రమే ఆడించాలని సూచించాడు.

షమీ స్థానంలో అతడే
అదే విధంగా జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని పేస్‌ దళంలో శార్దూల్‌ ఠాకూర్‌కు చోటిచ్చిన గంభీర్‌.. మహ్మద్‌ షమీ స్థానంలో ప్రసిద్‌ కృష్ణను ఆడిస్తే బాగుంటుందని సూచించాడు. ఇక కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఓపెనింగ్‌ జోడీగా యశస్వి జైశ్వాల్‌ను ఎంచుకున్న ఈ మాజీ ఓపెనర్‌.. శుబ్‌మన్‌ గిల్‌ వన్‌డౌన్‌లో వస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నాడు. 

ఈ మేరకు స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో గంభీర్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. మరోవైపు.. టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ మాత్రం.. సఫారీలతో టెస్టుకు భారత్‌ ఇద్దరు స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌లతో బరిలోకి దిగాలని సూచించడం గమనార్హం. అదే విధంగా పేస్‌ దళంలో ప్రసిద్‌కు కాదని ముకేశ్‌ కుమార్‌కు చోటిచ్చాడు గావస్కర్‌. మరి మీ ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఏదో కామెంట్లలో తెలియజేయండి.

సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు గంభీర్‌ ఎంచుకున్న భారత తుదిజట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా/ రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్‌ కృష్ణ, మహ్మద్ సిరాజ్.

చదవండి: WFI: మంచో చెడో.. రిటైర్‌ అయ్యా.. నాకేం సంబంధం లేదు! డబ్ల్యూఎఫ్‌ఐ మంచికి నాంది

>
మరిన్ని వార్తలు