-

IPL 2024: గుజరాత్‌ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి.. స్పందించిన హార్దిక్‌ పాండ్యా

27 Nov, 2023 14:52 IST|Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో  టీమిండియా స్టార్‌ ఆల్ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మళ్లీ సొంత గూటికి చేరాడు. ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్యా తిరిగి మళ్లీ ముంబై ఇండియన్స్‌లోకి వచ్చాడు.

ఐపీఎల్‌-2024 మినీ వేలానికి ముందు క్యాష్‌ ట్రేడింగ్‌ పద్దతి ద్వారా గుజరాత్‌ నుంచి ముంబై ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. ఇక ఈ విషయంపై హార్దిక్‌ పాండ్యా తొలిసారి స్పందించాడు. తన అరంగేట్ర ఫ్రాంచైజీకి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని హార్దిక్‌ ట్విట్‌ చేశాడు.

"ముంబై ఇండియన్స్‌లోకి తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను తిరిగి పొందనున్నాను. ముంబై, వాంఖడే, పల్టాన్‌ వంటి ఎన్నో మధుర జ్ఞాపకాలు ముంబైతో ఉన్నాయి" అని ట్విటర్‌లో రాసుకొచ్చాడు. అయితే అతడు చేసిన ట్విట్‌లో రెండు సీజన్‌ల పాటు ప్రాతినిథ్యం వహించిన గుజరాత్‌ టైటాన్స్‌ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. కాగా హార్దిక్‌ పాండ్యా తన ఐపీఎల్‌ అరంగేట్రం నుంచి 2021 సీజన్‌కు వరకు ముంబై ఇండియన్స్‌కే ప్రాతినిధ్యం వహించాడు.

అయితే ఐపీఎల్‌-2022 మేగా వేలానికి ముందు ముంబై అతడిని విడిచిపెట్టింది. ఈ క్రమంలో వేలంలోకి వచ్చిన అతడిని కొత్త ప్రాంఛైజీ గుజరాత్‌ టైటాన్స్‌ రూ.15 కోట్ల భారీ ధరకు కొనుగొలు చేసింది. అంతేకాకుండా ఐపీఎల్‌-2022లో తమ జట్టు పగ్గాలు కూడా అప్పగించింది.

ఈ క్రమంలో అరంగేట్ర సీజన్‌లోనే గుజరాత్‌ టైటాన్స్‌ను ఛాంపియన్స్‌గా నిలిపాడు. అంతేకాకుండా ఐపీఎల్‌-2023లో అతడి సారథ్యంలోనూ గుజరాత్‌ రన్నరప్‌గా నిలిచింది.  కాగా పాండ్యా తన  ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటివరకు 123 మ్యాచ్‌లు ఆడి 2309 పరుగులతో పాటు 53 వికెట్లు సాధించాడు.
చదవండి: IPL 2024: గుజరాత్‌ టైటాన్స్‌ నయా కెప్టెన్‌ అతడే..!

మరిన్ని వార్తలు