Sakshi News home page

రోహిత్‌, కోహ్లి ఓపెన్‌గా మాట్లాడితేనే: టీమిండియా మాజీ బౌలర్‌

Published Mon, Nov 27 2023 3:16 PM

Rohit Kohli Have To Openly Talk About Their T20I Future: Ojha - Sakshi

టీమిండియా స్టార్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి టీ20 వరల్డ్‌కప్‌-2024 టోర్నీలో ఆడతారా? లేదా? అన్న చర్చ క్రీడావర్గాల్లో జోరుగా నడుస్తోంది. వన్డే వరల్డ్‌కప్‌-2023 ముగిసిన తర్వాత వీరిద్దరు అంతర్జాతీయ టీ20లకు పూర్తిగా దూరం కానున్నారనే వార్తల నేపథ్యంలో మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో భారత మాజీ బౌలర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా కూడా చేరాడు.

తమ టీ20 భవితవ్యం గురించి రోహిత్‌, కోహ్లి బోర్డుతో ఓపెన్‌గా మాట్లాడిన తర్వాతే ఈ విషయంపై ఓ స్పష్టత వస్తుందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు హిందుస్తాన్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి వాళ్లిద్దరు ఇప్పటికే తమ భవిష్యత్తు గురించి మేనేజ్‌మెంట్‌తో చర్చలు మొదలుపెట్టి ఉంటారు.

అయితే, సెలక్షన్‌ కమిటీ కూడా వాళ్ల అభిప్రాయాలను కచ్చితంగా గౌరవిస్తుంది. వాళ్ల భవిష్యత్‌ ప్రణాళికల గురించి స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. ఏ క్రికెట్‌ బోర్డు అయినా సరే ప్రతి ఆటగాడి విషయంలో ఇలాగే ఆలోచిస్తుంది.

వరల్డ్‌కప్‌- వరల్డ్‌కప్‌ సైకిల్‌ మధ్య ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, ఫామ్‌ అన్నీ దృష్టిలో పెట్టుకుని అంతిమ నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు వన్డే వరల్డ్‌కప్‌ ముగిసిపోయింది.

తదుపరి వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ ఆడాల్సి ఉంది. అందుకోసం ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సన్నద్ధమవ్వాలి. కాబట్టి రోహిత్‌, విరాట్‌తో మాట్లాడి వీలైనంత త్వరగా వాళ్ల నిర్ణయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది.

వాళ్లిద్దరు సీనియర్‌ మోస్ట్‌ క్రికెటర్లు. దేశం కోసం ఎంతో చేశారు. కాబట్టి మేనేజ్‌మెంట్‌ వాళ్లకు కాస్త ఎక్కువగానే టైమ్‌ ఇస్తుంది. చర్చలు ముగిసిన తర్వాతే రోహిత్‌, కోహ్లి అంతర్జాతీయ టీ20లు ఆడతారా లేదా అన్నది తెలుస్తుంది’’ అని ఓజా అభిప్రాయపడ్డాడు.

కాగా 36 ఏళ్ల రోహిత్‌ శర్మ టీ20లకు స్వస్తి పలికితే హార్దిక్‌ పాండ్యా పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్‌ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు.. 35 ఏళ్ల కోహ్లి మాత్రం ఈ ఫార్మాట్లో ఇంకొన్నాళ్లు కొనసాగుతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చదవండి: గుజరాత్‌ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి.. స్పందించిన హార్దిక్‌ పాండ్యా

Advertisement

What’s your opinion

Advertisement