-

IPL 2024: అతడిని వదిలేసి సన్‌రైజర్స్‌ తప్పుచేసింది.. పశ్చాత్తాపపడక తప్పదు: టామ్‌ మూడీ

27 Nov, 2023 13:32 IST|Sakshi
సన్‌రైజర్స్‌ జెర్సీలో హ్యారీ బ్రూక్‌ (PC: SRH/IPL)

IPL 2024- Sunrisers Hyderabad: ఇంగ్లండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ విషయంలో తీసుకున్న నిర్ణయంపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పశ్చాత్తాపపడక తప్పదని ఆ జట్టు మాజీ కోచ్‌ టామ్‌ మూడీ అన్నాడు. బ్రూక్‌ వంటి అద్భుతమైన నైపుణ్యాలున్న ఆటగాడిని వదిలి ఫ్రాంఛైజీ తప్పు చేసిందని అభిప్రాయపడ్డాడు. కాగా గత ఐపీఎల్‌ వేలంలో  హ్యారీ బ్రూక్‌ను రూ. 13 కోట్ల 25 లక్షలకు సన్‌రైజర్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ డాషింగ్‌ క్రికెటర్‌ ప్రదర్శన ఆశించినస్థాయిలో లేకపోవడంతో తాజా వేలానికి ముందు విడుదల చేసింది. ఐపీఎల్‌-2023లో బ్రూక్‌ 11 మ్యాచ్‌లు ఆడి కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని వదిలేయాలని నిర్ణయించుకున్న సన్‌రైజర్స్‌ ఆదివారం నాటి రిలీజ్‌ లిస్టులో బ్రూక్‌ పేరును చేర్చింది.

సగం ధరకే కొనాలని ప్లాన్‌! కానీ..
ఈ విషయంపై స్పందించిన ఎస్‌ఆర్‌హెచ్‌ మాజీ కోచ్‌, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ టామ్‌ మూడీ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘బ్రూక్‌ను రిలీజ్‌ చేసి మళ్లీ సగం ధరకే అతడిని సొంతం చేసుకోవాలన్నది సన్‌రైజర్స్‌ వ్యూహం అయి ఉండొచ్చు.

అయితే, ఇలాంటి నిర్ణయం వల్ల ఎస్‌ఆర్‌హెచ్‌ కచ్చితంగా పశ్చాత్తాపపడుతుంది. ఎందుకంటే.. హ్యారీ బ్రూక్‌ తప్పకుండా వేలంలోకి వస్తాడు. అసాధారణ ప్రతిభ ఉన్న బ్రూక్‌ కోసం పోటీ తప్పకుండా ఉంటుంది’’ అని టామ్‌ మూడీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

అతడిని బాధ్యుడిని చేయడం సరికాదు
అదే విధంగా బ్రూక్‌ సేవలను సన్‌రైజర్స్‌ సరిగ్గా ఉపయోగించుకోలేకపోయిందని టామ్‌ మూడీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. టీ20 క్రికెట్‌లో ఓపెనింగ్‌ చేయని బ్యాటర్‌ను టాపార్డర్‌కు ప్రమోట్‌ చేసి ఎస్‌ఆర్‌హెచ్‌ తప్పు చేసిందని పేర్కొన్నాడు. 

మిడిలార్డర్‌ బ్యాటర్‌ను ముందుగా రప్పించి మూల్యం చెల్లించడమే కాకుండా.. అందుకు అతడిని బాధ్యుడిని చేయడం సరికాదని విమర్శించాడు. యువ ఆటగాడైన బ్రూక్‌ సేవలను సుదీర్ఘకాలం పాటు వినియోగించుకునే అవకాశాన్ని మిస్‌ చేసుకుందని టామ్‌ మూడీ సన్‌రైజర్స్‌ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.

కాగా ఐపీఎల్‌-2024 వేలానికి ముందు.. సన్‌రైజర్స్‌ జట్టు ఆదిల్‌ రషీద్‌ (ఇంగ్లండ్‌), అకీల్‌ హోసిన్‌ (వెస్టిండీస్‌), దేశవాళీ క్రికెటర్లు సమర్థ్‌ వ్యాస్, వివ్రాంత్‌ శర్మ, కార్తీక్‌ త్యాగిలను కూడా విడుదల చేసింది. వేలం కోసం ప్రస్తుతం సన్‌రైజర్స్‌ వద్ద రూ. 34 కోట్లు ఉన్నాయి. 
చదవండి: T20I: యశస్వి సరికొత్త చరిత్ర.. రోహిత్‌ రికార్డు బ్రేక్‌

మరిన్ని వార్తలు