సాత్విక్‌–చిరాగ్‌ జోడీ ఓటమి.. ముగిసిన భారత క్రీడాకారుల పోరాటం

7 Sep, 2023 08:33 IST|Sakshi
సాత్విక్‌–చిరాగ్‌ జోడీ ఓటమి (PC: BAI)

చాంగ్జౌ: చైనా ఓపెన్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ రెండో ర్యాంక్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి 17–21, 21–11, 17–21తో షోహిబుల్‌ ఫిక్రి–మౌలానా బగస్‌ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయింది.

మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌ లో సిక్కి రెడ్డి–రోహన్‌ కపూర్‌ జంట 15–21, 16–21తో చెన్‌ టాంగ్‌ జియె–తో ఈ వె (మలేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది.  

Asia TT Championship 2023: Indian Mens Team Won Bronze Medal: భారత జట్టుకు కాంస్యం
ప్యాంగ్‌చాంగ్‌ (దక్షిణ కొరియా): ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు మరోసారి కాంస్య పతకంతో సంతృప్తి పడింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 0–3తో చైనీస్‌ తైపీ చేతిలో ఓడిపోయింది. ఆచంట శరత్‌ కమల్, సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ , హర్మీత్‌ దేశాయ్‌ తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓడిపోయారు. 2021 ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ భారత జట్టు సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకం దక్కించుకుంది.    

తొమ్మిదో స్థానంలో అర్జున్‌ 
టాటా స్టీల్‌ ఇండియా చెస్‌ ఓపెన్‌ ర్యాపిడ్‌ టోర్నీలో ఆరు రౌండ్లు ముగిశాక తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ 2.5 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాడు. కోల్‌కతాలో 10 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం 3 రౌండ్లు జరిగాయి.

నాలుగో గేమ్‌లో గ్రిష్‌చుక్‌ (రష్యా) చేతిలో 55 ఎత్తుల్లో ఓడిన అర్జున్‌... ఐదో గేమ్‌లో 67 ఎత్తుల్లో విదిత్‌ (భారత్‌)పై గెలిచాడు. గుకేశ్‌ (భారత్‌)తో జరిగిన ఆరో గేమ్‌ను అర్జున్‌ 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. విదిత్, ప్రజ్ఞానంద, గుకేశ్‌ 3 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.    

మరిన్ని వార్తలు