CWG 2022: కంటతడి పెట్టిన కిదాంబి శ్రీకాంత్‌.. స్వర్ణం చేజారాక తీవ్ర భావోద్వేగం

3 Aug, 2022 17:39 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 22వ కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి సత్తా చాటుతున్నారు. ఆరో రోజు లవ్‌ప్రీత్‌ సింగ్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో కాంస్యం గెలవడంతో భారత్‌ పతకాల సంఖ్య 14కు చేరింది. భారత్‌ సాధించిన ఈ పతకాలలో 9 వెయిట్‌ లిఫ్టింగ్‌లోనే సాధించినవి కాగా, మిగతా 5 మెడల్స్‌.. జూడో (2), లాన్స్‌ బౌల్స్‌‌ (1), టేబుల్‌ టెన్నిస్ (1)‌, బ్యాడ్మింటన్‌ (1) క్రీడల్లో గెలిచినవి. 

ఇదిలా ఉంటే, క్రీడల ఐదో రోజు బ్యాడ్మింటన్‌ మిక్సడ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌ సాధించిన సిల్వర్‌ మెడల్‌పై ప్రస్తుతం నెట్టింట జోరుగా చర్చ సాగుతుంది. ఈ ఈవెంట్‌ ఫైనల్లో భారత జట్టు 1-3 తేడాతో మలేషియా చేతిలో దారుణంగా ఓడి రజతంతో సరిపెట్టుకుం‍ది. భారత్‌ ఆడిన నాలుగు గేమ్‌ల్లో ఒక్క పీవీ సింధు మాత్రమే విజయం సాధించింది. స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ సహా సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి జోడీ కూడా ఫైనల్లో ఓటమిపాలై భారత్‌ బంగారు ఆశలను నీరుగార్చారు. 

అయితే ఓటమి అనంతరం కిదాంబి శ్రీకాంత్ కంటతడి పెట్టిన వైనం భారత అభిమానులను చాలా బాధించింది. శ్రీకాంత్‌.. తన వల్లే భారత్‌ స్వర్ణం గెలిచే అవకాశాన్ని కోల్పోయిందని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ విషయాన్ని సహచరుడు సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి మీడియాకు తెలిపాడు. శ్రీకాంత్ అలా ఏడవడం చూస్తే చాలా బాధ అనిపించిందని, అతన్ని ఆ పరిస్థితిలో చూడటం అదే మొదటిసారి అని సాత్విక్‌ అన్నాడు. 
చదవండి: కొనసాగుతున్న భారత వెయిట్‌ లిఫ్టర్ల హవా.. ఇవాళ మరో పతకం
 

మరిన్ని వార్తలు