CWG 2022: భారత్‌ ఖాతాలో ఆరో స్వర్ణం.. పారా పవర్‌లిఫ్టింగ్‌లో తొలి పతకం

5 Aug, 2022 07:41 IST|Sakshi

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం వచ్చి చేరింది. పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ లో సుధీర్ స్వర్ణం గెలుచుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో పారా పవర్ లిఫ్టింగ్ స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా సుధీర్ చరిత్ర సృష్టించాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఆరో బంగారు పతకం కైవసం చేసుకుంది. గేమ్స్‌లో ఇప్పటివరకు భారత్ ఆరు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఏడు కాంస్యాలతో మొత్తం 20పతకాలు సాధించింది. ప్రస్తుతం పతకాల పట్టికలో ఏడవ ర్యాంకులో భారత్ కొనసాగుతోంది.

కాగా పారా పవర్ లిఫ్టింగ్‌లో విజేతను పాయింట్ల ఆధారంగా నిర్ణయిస్తారు. ఇందులో పాల్గొనేవారి శరీర బరువు అలాగే అతను ఎత్తే బరువు ఆధారంగా పాయింట్లు లెక్కిస్తారు. 87 కేజీల సుధీర్ తన తొలి ప్రయత్నంలోనే 208 కేజీలు ఎత్తి 132 పాయింట్లకు పైగా సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. అదే సమయంలో అతను నైజీరియన్ పవర్‌లిఫ్టర్ నుంచి కఠిన సవాల్‌ను ఎదుర్కొన్నాడు. దీంతో రెండవ ప్రయత్నంతో సుధీర్‌ రెండోస్థానానికి పడిపోయాడు. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోని భారత అథ్లెట్‌ రెండవ ప్రయత్నంలో 212 కిలోల బరువును ఎత్తి 134.5 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించాడు.

ఇదే సమయంలో నైజీరియాకు చెందిన ఇకెచుక్వు క్రిస్టియన్ ఉబిచుక్వు తన చివరి ప్రయత్నంలో 203 కిలోలు ఎత్తడంలో విఫలమయ్యాడు. ఇది సుధీర్ బంగారు పతకం అవకాశాలను మెరుగుపరచింది. ఇదే ఈవెంట్‌లో నైజీరియాకు చెందిన ఇకెచుక్వు, క్రిస్టియన్ ఉబిచుక్వు 133.6 స్కోరుతో రజతం గెలుచుకోగా, స్కాట్లాండ్‌కు చెందిన మిక్కీ యూల్ 130.9 స్కోరుతో కాంస్యం గెలుచుకున్నాడు. క్రిస్టియన్ 197 కిలోలు ఎత్తగా, యూల్ 192 కిలోలు ఎత్తాడు. హర్యానాలోని సోనిపట్ లో ఓ రైతు కుటుంబంలో సుధీర్ జన్మించారు. తీవ్ర జ్వరం కారణంగా నాలుగేళ్ల వయసులో పోలియో బారిన పడ్డాడు. కానీ అతనికి వైకల్యం అడ్డురాలేదు. క్రీడలపై జీవితాంతం ఆసక్తిని కనబర్చాడు.

చదవండి: CWG 2022: మురళీ శ్రీశంకర్‌ కొత్త చరిత్ర.. లాంగ్‌జంప్‌లో భారత్‌కు రజతం

మరిన్ని వార్తలు