రెజ్లర్ల ఆందోళన.. బ్రిజ్‌భూషణ్‌ ఇంటికి పోలీసులు

6 Jun, 2023 14:44 IST|Sakshi

లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడు బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ నివాసానికి పోలీసులు వెళ్లడం ఆసక్తి కలిగించింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గోండాలో ఉన్న ఆయ‌న నివాసంలో పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. ఆ ఇంట్లో ఉన్న సుమారు 12 మంది నుంచి వాంగ్మూలాన్ని సేక‌రించారు. ఆ స్టేట్మెంట్ల‌ను రికార్డు చేశారు. 

వాంగ్మూలం ఇచ్చిన వారి పేర్ల‌ను, అడ్ర‌స్‌, ఐడీ కార్డుల‌ను తీసుకున్నారు. సాక్ష్యం కోస‌మే ఆ డేటాను సేక‌రించిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడు బ్రిజ్‌కు అనుకూలంగా ఉన్న అనేక మంది మ‌ద్ద‌తుదారులను కూడా ఢిల్లీ పోలీసులు ప్ర‌శ్నించారు. బ్రిజ్‌పై లైంగిక వేధింపుల కేసులో స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్ ఇప్ప‌టి వ‌ర‌కు 137 మంది నుంచి స్టేట్మెంట్ల‌ను రికార్డు చేసింది. అయితే బ్రిజ్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయ‌నని విచారించారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

కాగా రెజ్లర్లు వినేశ్‌ ఫొగాట్‌, సాక్షి మాలిక్‌, భజరంగ్‌ పూనియాలు రైల్వే ఉద్యోగాల్లో చేరడంతో ఆందోళన ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలను రెజ్లర్లు ఖండించారు. తాము ఆందోళన విరమించే ప్రసక్తే లేదని.. విధులు నిర్వహిస్తూనే తాము నిరసన వ్యక్తం చేస్తామని పేర్కొన్నారు. ''హింస లేకుండా ఉద్యమాన్ని ఎలా కొనసాగించాలని ఆలోచిస్తున్నాం. మా సత్యాగ్రహాన్ని, ఉద్యమాన్ని బలహీనపరిచే కుట్ర ఇది. కేంద్ర హోంమంత్రితో సమావేశంలో తుది పరిష్కారం దొరకలేదు. మాకు హాని తలపెట్టాలనే ఉద్దేశంతోనే ఇలా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారు.'' అంటూ తెలిపారు.


 

మరిన్ని వార్తలు