FIFA WC 2022: ఏం గుండెరా నీది.. చచ్చేంత సమస్య ఉన్నా దేశం కోసం బరిలోకి

9 Dec, 2022 13:40 IST|Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో శుక్రవారం అర్జెంటీనా, నెదర్లాండ్స్‌ మధ్య క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు చేరుతుంది. ఇక గ్రూప్‌ దశలో ఓటమి ఎరుగని నెదర్లాండ్స్‌ను మెస్సీ సేన ఏ విధంగా ఎదుర్కొంటుందనేది ఆసక్తికంగా మారింది. అయితే 2014 ఫిఫా వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్లో ఈ రెండుజట్లు ఎదురుపడ్డాయి. అప్పటి మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా.. డచ్‌ జట్టుపై విజయాన్ని అందుకుంది.  

ఈ విషయం పక్కనబెడితే.. నెదర్లాండ్స్‌ సీనియర్‌ స్టార్‌ ఆటగాడు డేలీ బ్లైండ్‌ గురించి ఒక ఆసక్తికర విషయం బయటకొచ్చింది. గుండె సమస్యతో బాధపడుతూ కూడా ధైర్యంగా మైదానంలో ఫుట్‌బాల్‌ ఆడడం అతనికే చెల్లింది. డేలీ బ్లైండ్‌ కొంతకాలంగా గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడు. ఎక్కువగా పరిగెడితే వచ్చే ఆయాసంతో బ్లైండ్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

అందుకే డేలీ బ్లైండ్‌ ఏ మ్యాచ్‌లో బరిలోకి దిగినా తనవెంట డిఫిబ్రిలేషన్‌(Defibrillation) మెషిన్‌ ఉంటుంది. డీఫిబ్రిలేషన్ అనేది ప్రాణాంతక కార్డియాక్ అరిథ్మియాలకు చికిత్సగా పనిచేస్తుంది. వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ (V-Fib), నాన్-పెర్ఫ్యూజింగ్ వెంట్రిక్యులర్ టాచీకార్డియా (V-Tach)లకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. డీఫిబ్రిలేటర్ ద్వారా గుండెకు కరెంట్‌షాక్‌ ఇచ్చి ఊపిరి ఆగిపోకుండా ఉంచుతారు.(దీనినే వైద్య భాషలో  కౌంటర్-షాక్ అని పిలుస్తారు).


డిఫిబ్రిలేటర్‌(Defibrillator)

మరి ఇంత సమస్య పెట్టుకొని డేలీ బ్లైండ్‌ను ఆడించడం అవసరమా అనే డౌట్‌ రావొచ్చు. కానీ అతను జట్టుకు కీలక ఆటగాడు. ఫిఫా వరల్డ్‌కప్‌లో  అమెరికాతో జరిగిన ప్రీక్వార్టర్స్‌ మ్యాచ్‌లో గోల్‌ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అందుకే అతన్ని జట్టు నుంచి తప్పించడం పెద్ద సాహసమే అవుతుందని జట్టు మేనేజర్‌ పేర్కొన్నాడు.

అయితే ఇదివరకే డేలీ బ్లైండ్‌ డిఫిబ్రిలేషన్‌ను ఉపయోగించారు. 2019లో చాంపియన్స్‌ లీగ్‌ సందర్భంగా ఒక మ్యాచ్‌లో బ్లైండ్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి డిఫిబ్రిలేషన్‌ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే అప్పుడే ఫుట్‌బాల్‌ ఆటను మానుకోవాలని బ్లైండ్‌ను హెచ్చరించారు. కానీ బ్లైండ్‌ వారి మాటను లెక్కచేయలేదు.

ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో ఎలాగైనా పాల్గొనాలని ధ్యేయంగా పెట్టుకున్న డేలీ బ్లైండ్‌ తన వెంట డిఫిబ్రిలేషన్‌ మిషన్‌ను తెచ్చుకున్నాడు. చనిపోయేంత సమస్య ఉన్నప్పటికి భయపడకుండా దేశం కోసం బరిలోకి దిగిన అతని గుండె ధైర్యాన్ని అందరు మెచ్చుకుంటున్నారు. నెదర్లాండ్స్‌ కప్‌ గెలుస్తుందో లేదో తెలియదు కానీ డేలీ బ్లైండ్‌ మాత్రం అభిమానుల మనసులను గెలిచేశాడు. 

చదవండి: 'ఇంపాక్ట్‌ ప్లేయర్‌' నిబంధన.. బీసీసీఐ షాకింగ్‌ ట్విస్ట్‌!

ఖతర్‌లో వరల్డ్‌కప్‌.. ప్రపంచానికి తెలియని మరణాలు!

మరిన్ని వార్తలు