మైదానంలో ఆటగాడికి గాయం.. ప్రత్యర్ధి అభిమానులు ఏం చేశారో తెలుసా..?

13 Jun, 2021 15:04 IST|Sakshi

కోపెన్‌హెగెన్‌: ఆట శ‌త్రువులను సైతం దగ్గరికి చేస్తుందనటానికి ఇప్పుడు మనం చూడబోయే వీడియోనే ప్రత్యక్ష ఉదాహరణ. యూరోక‌ప్ 2020 ఫుట్‌బాల్‌ పోటీల్లో భాగంగా ఫిన్లాండ్‌, డెన్మార్క్ జట్ల మ‌ధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అపురూప ఘ‌ట్టం చోటు చేసుకుంది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటన క్రీడా ప్రేమికులను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో డెన్మార్క్ స్టార్ ప్లేయ‌ర్ క్రిస్టియన్ ఎరిక్‌స‌న్ గాయ‌ప‌డ్డాడు. గ్రౌండ్‌లోనే కుప్ప‌కూలిపోయాడు. దీంతో అత‌న్ని స్ట్రెచ‌ర్‌పై బ‌య‌ట‌కు తీసుకెళ్లాల్సి వ‌చ్చింది. ఈ స‌మ‌యంలో ఎరిక్‌సన్‌ కెమెరా కంట పడకుండా డెన్మార్క్ ఆటగాళ్లంతా చుట్టూ రక్షణగా నిలిచారు. ఇది గమనించిన ఫిన్లాండ్ అభిమానులు త‌మ చేతుల్లోని జాతీయ జెండాల‌ను డెన్మార్క్‌ ఆటగాళ్లకు ఇచ్చారు. 

వాటి సాయంలో డెన్మార్క్‌ క్రీడాకారులు ఎరిక్‌స‌న్‌ను మైదానం బ‌య‌ట‌కు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఇరు దేశాల అభిమానులు క్రిస్టియ‌న్‌ ఎరిక్‌స‌న్ పేరును స్మరిస్తూ.. హర్షధ్వానాలు చేశారు. కాగా, ఫిన్లాండ్ అభిమానులు చూపిన ఔదార్యం క్రీడాభిమానుల‌ను విపరీతంగా ఆక‌ట్టుకుంది. సోషల్‌ మీడియా వేదికగా ఆ దేశ అభిమానులపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. నిజమైన క్రీడా ప్రేమికులు తమ అభిమానాన్ని ఇలానే చాటుతారంటూ కామెంట్ల వర్షం కురుస్తుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఫిన్లాండ్ 1-0 తేడాతో డెన్మార్క్‌పై విజ‌యం సాధించింది. సెకండాఫ్‌లో ఫిన్లాండ్‌ ప్లేయ‌ర్ జోయెల్ పోజాన్‌పాలో గోల్ చేసి, తమ జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు.
చదవండి: పాపం మనీశ్‌ పాండే.. అవకాశాలివ్వకుండా తొక్కేశారు!

మరిన్ని వార్తలు